మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు నిరసనగా జగన్ ఢిల్లీ ధర్నా?.. సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనా?
Publish Date:Jul 30, 2025
Advertisement
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్టౌతున్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదుల వరకూ వెడుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కు అరెస్టు భయం పెచ్చరిల్లిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో తనకు కూడా అరెస్టు తప్పదన్న భయంతో ఆయన హస్తినలో అండ కోసం పాకులాడుతున్నారు. అందుకే ఢిల్లీ యాత్రకు యోచిస్తున్నారు. జగన్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు వ్యతిరేకంగా ఢిల్లీలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీఎంతా జగన్ ఉన్న సమయంలో ఆయనకు కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సలహాదారు వాసుదేవరెడ్డి, ఈ కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి, ఇక జగన్ కుటుంబానికి సన్నిహితుడు, భారతీ సిమ్మెంట్స్ ఆడిటర్ గోవిందప్ప సహా పలువురు అరెస్టు కావడంతో.. దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ కు రావడానికి ఇంకెంతో కాలం పట్టదన్న భయంతో జగన్ హస్తినలో హడావుడి చేసి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందంటూ జగన్ హస్తినకు వెళ్ల ధర్నా చేసే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హస్తినలో వివిధ జాతీయ పార్టీల మద్దతు కూడగట్టి ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆయన గత సోమవారమే హస్తిన పర్యటనకు బయలుదేరాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల వచ్చే నెలలో అంటే ఆగస్టులో హస్తినకేగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మద్యం కుంభకోణం అరెస్టులకు నిరసనగా హస్తినలో ధర్నా చేస్తే జాతీయ స్థాయిలో జగన్ పరువు, వైసీపీ పరువు మసకబారుతుందని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టైన సంగతిని జగన్ గుర్తుంచుకోవాలని పరిశీలకులు విశ్లేషిస్లున్నారు. అన్నిటికీ మింది జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయించినా.. డిజిటల్ పేమెంట్స్ కు ఎందుకు నో చెప్పిందన్న ప్రశ్న జాతీయ మీడియా నుంచి వస్తే జగన్ సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఎదుర్కొనడం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా మద్యం కుంభకోణం అరెస్టులకు వ్యతిరేకంగా జగన్ హస్తిన వెళ్లి యాగీ చేస్తే మాత్రం ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-delhi-tour-against-madyam-scam-arrests-39-203062.html





