జగన్ హస్తిన ధర్నా అట్టర్ ఫ్లాప్
Publish Date:Jul 25, 2024
.webp)
Advertisement
జగన్ హస్తిన ధర్నా ఘోరంగా విఫలమైంది. ఎంత ప్రయత్నించినా ఆయన ధర్నాకు జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ పెద్దగా లేదు. ఎంతో కష్టపడి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల పార్టీల నేతలను ధర్నాకు తీసుకురాగలిగినా.. వారెవరూ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న మాట పొరపాటున కూడా నోటి వెంట రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఏదో మొహమాటానికి వచ్చినట్లుగా వచ్చి ధర్నాలో కూర్చుని వెళ్లిపోయినట్లుగా వారి తీరు కనిపించింది.
ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ జగన్ హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అదే ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ ధర్నా కంటే ఆయన నిరసనకే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే పరిశీలకులు మాత్రం జగన్ ధర్నా ఒక సాకు మాత్రమేననీ, ఆయన హస్తిన టూర్ అసలు ఉద్దేశం వేరే ఉందని అంటున్నారు. అఖిలేష్ ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లాలన్నది ఒక ప్లాన్ కాగా, ఎలాగో అలా బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ సాధించి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం కాకుండా చూసుకోవాలన్నది మరో ప్లాన్ అని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు అఖిలేష్ ను అతి కష్టమ్మీద ధర్నాకు తీసుకువచ్చారని అంటున్నారు. ఆయన ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానంతో టచ్ లోకి వెళ్లాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు.
పనిలో పనిగా బీజేపీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కూడా కోరానని చెబుతున్నారు. ఆ కారణంగానే హస్తినలో ధర్నా అయిపోయినా జగన్ ఇంకా అక్కడే మకాం వేశారని చెబుతున్నారు.
ఇది పక్కన పెడితే ధర్నా ముందూ, తరువాత కూడా మీడియాతో మాట్లాడిన జగన్ ఆవు కథ చెప్పడానికే పరిమితమయ్యారు. జాతీయ మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి అస్సలు ఇష్ట పడలేదు. తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారం చేపట్టిన అనంతరం జరిగిన హింసాకాండలో మరణించిన వారి పేర్లు చెప్పమన్న మీడియా ప్రశ్నకు ఇక్కడ ఫొటో ఎగ్జిబిషన్ చూడండి, టాపిక్ ను డైవర్ట్ చేయకండి అంటూ అసహనం చేశారు. జగన్ మీడియాతో మాట్లాడిన రెండు సార్లూ కూడా స్వోత్కర్ష్, పర నిందకే ప్రాధాన్యత ఇచ్చారు. తన హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉందనీ, ఎక్కడా కక్ష సాధింపు ధోరణి, హింసాకాండా లేదనీ చెప్పుకుని తన భుజాలను తానే చరిచేసుకున్నారు.
అదే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నిండా 45 రోజులు కూడా కాకుండానే రాష్ట్రం అగ్ని గుండంలా మారిందనీ, రాజకీయ హింస ప్రజ్వరిల్లిందనీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయనీ గగ్గోలు పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జగన్ ధోరణితో వైసీపీ నేతలే నివ్వెర పోయారు. జగన్ తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-delhi-dharna-utter-flop-25-181470.html












