నాడు ముద్దులు.. నేడు ఆలింగనాలు
Publish Date:Jul 28, 2022
Advertisement
పూటకో మాట.. రోజుకో వేషం అన్నట్లగా ఉంది జగన్ తీరు. ప్రజలలో జగన్ సర్కార్ పై విశ్వసనీయత కోల్పోతున్న సంగతి ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో వారిని మళ్లీ వైసీపీవైపు మళ్లించడానికీ, తన పై విశ్వసనీయత పెరిగేలా చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఇళ్లూ వాకిలీ వదిలేసి నిత్యం జనంలోనే తిరిగి ఒక్క చాన్స్.. ఒకే ఒక్కచాన్స్ అంటూ అదేదో సినిమాలో హీరోయిన్ లా జనాలను ప్రాధేయపడిన ఆయన తీరా అధికారం చిక్కిన తరువాత జనం మొహం చూసిన సందర్భాలు అతి స్వల్పం. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడమే గగనం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. గత ఎన్నికలకు ముందు జనంలో తిరుగుతూ అవ్వలు, తాతలు, అక్కమ్మలు, చెల్లెమ్మలు అంటూ కనిపించిన వారికల్లా ముద్దులు పెట్టి, నెత్తిన చేయి పెట్టి ఆశీర్వదించిన జగన్... అధికారంలోకి వచ్చిన తరువాత ముద్దులు, ఆశీర్వచనాల సంగతి అలా ఉంచి పన్నులు, వడ్డింపులూ అంటూ గుద్దులు మొదలెట్టారు. మూడేళ్లు గడిచిపోయిన తరువాత ఇప్పుడు మళ్లీ జనం గుర్తుకు వచ్చారా అని జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా చేసిన హడావుడి, మళ్లీ జనంలో మమేకం కావడానికి పడిన తాపత్రయం చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటనలో ‘సెలెక్టడ్’ జనం మాత్రమే ఆయన దగ్గరకు వెళ్లగలిగారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన వరద బాధితులెవరూ జగన్ పర్యటన పట్ల ఆసక్తి చూపలేదనీ అంటున్నారు. స్థానిక నేతలు ఎంపిక చేసిన వారు మాత్రమే జగన్ కు చేరువగా వెళ్లి ఆయనతో ఫొటోలు దిగారంటున్నారు. గతంలో ముద్దులతో మురిపించిన జగన్ ఈ సారి వరద బాధితుల పరామర్శ పర్యటనలో ఆలింగనాలకు పని చెప్పారు. ఇది చూసి నాడు ముద్దులు..నేడు ఆలింగనాలు తప్ప వాస్తవంగా ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-change-his-style-witm-mingling-people-25-140724.html





