జగనన్నా.. ఎం సెప్తిరి.. ఏం సెప్తిరి!
Publish Date:Jul 28, 2022
Advertisement
తాజ్‌మహల్ ఎవరు కట్టించిరి.. షాజహాన్., మీ ఊళ్లో పెద్ద సినిమా హాలు ఎవరు కట్టించారు.. మా పెద్దిరెడ్డి గారు, మీ ఊళ్లో మంచినీళ్ల చెరువు ఎవరు తవ్వించారు.. మా చిన్నినాయుడుగారు.. పదిరూపాయలనోటు మీద బొమ్మ.. గాంధీ బొమ్మ..మన ప్రధాని.. నరేంద్రమోదీ.. ఇవన్నీ ఓ టీచరు అడిగిన ప్రశ్నలకు ఓ ఏడో తరగతి పిల్లాడు చెప్పిన సమాధానాలు. మరి ఆ నోట్లు ఎక్కడ నుంచి వచ్చును..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక్కడు.. ఇంకెవరు మన జగనన్న. ప్రశ్నలకు సరిగా సమాధానాలు రాసిన వారే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. కనీసం సగం రాసినవారయినా పాస్ కావడానికి కాస్తంత అవకాశమూ ఉంది. కానీ ఎలాంటి నిజాయితీ లేకుండా కేవలం కబుర్లు, వాగ్దానాలు, పథ కాల పేర్లతో పాలనను కొనసాగించడం మాత్రం జగన్‌కే చెల్లుతుంది. జగన్ ప్రభుత్వ తీరు తెన్నులు, పాలనా లోపాల గురించి, అప్పుల గోల గురించి ఎవరు ఎన్ని ప్రశ్నించినా కేంద్రం మీదకి నెట్టేయడం ఆయనకు అధికారంతో అబ్బిన విద్య. ప్రతీదీ కేంద్రానికే ముడిపెట్టడంతో అలవాటులో పొరపాటుగా వరద బాధితులతో మాట్లాడే టపుడు కూడా అవే చిలకపలుకులు పలికి జగన్ తన ప్రత్యేకతను మరింత ప్రత్యేకంగా బయటపెట్టుకున్నారు. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు వరద ప్రభావిత జిల్లాల్లో జగన్ పర్యటించారు. ఆ సందర్భంగా ప్రజలకు సమస్యలు, వాటి పరిష్కారం గురించి చిరు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ప్రసంగంలో తనకు మాత్రమే ప్రత్యేక మైన జ్ణాన్నాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం నోట్లు ప్రింటు చేసిస్తే అన్ని పనులూ అయిపోతాయన్నారు. అయితే కేంద్రం ఆ పని చేయడం లేదని, కేంద్రం ఆ పని మొదలెట్టేసి డబ్బులు ఇవ్వగానే అన్ని సమస్యలనూ చిటికెలో పరిష్కరించేస్తానని జగన్ చెప్పారు. కేంద్రప్రభుత్వం నోట్లు ప్రింటు చేసేదేమిటని అటుగా వెళుతూన్న పశువుల కాపరి తలగోక్కున్నాడు. అలగెలావుద్ది మగానుబావా! అనుకున్నాడు. కాబోతే ఆ కుర్రాడు కాస్తంత దూరంగా ఉన్నాడు గనుక పైకి వినిపించేలా అనేశాడు. కానీ సీఎం జగన్ చుట్టూరా వున్నవారు మాత్రం తప్పకుండా లోలోపల అదే ప్రశ్నను వేల సార్లు వేసుకుని, కడుపులో కత్తులు దించు కునీ మరీ బాధపడి ఉంటారు. కానీ సీఎంగారి జ్ఞాన గుళిక తీసుకొనకపోతే అమర్యాదేమోనని అవునా సార్ అని తలగుడ్డ మళ్లీ తలకు చుట్టుకున్నారు. సీఎం జగన్ అలా చిరునవ్వుతో మరో గ్రామానికి పయన మయ్యారు.
http://www.teluguone.com/news/content/jagan-blame-center-for-not-printing-currency-25-140739.html





