అంతా అయిపోయాకా ఇప్పుడెందుకీ యాత్ర?
Publish Date:Jul 5, 2025
Advertisement
జూలై 9న జగన్ మామిడి టూర్ సీజన్ అయ్యాకా వచ్చి ప్రయోజనమేంటంటున్న రైతులు చిత్తూరు జిల్లా మామిడి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై 9న జగన్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వచ్చి ఇక్కడి రైతులను పరమార్శించనున్నారు. కారణం ఈ రైతులకు తగిన ధర లేక అవస్థ పడుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు. ఇక జగన్ ఓదార్పు యాత్ర అంటే తెలియందేముంది. వైసీపీ శ్రేణులు, నేతలు రెచ్చిపోయి ప్రకటనలు గుప్పించేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టేస్తున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా వంటి వారు జగన్ వస్తున్నాడనే సరికి తెలుగుదేశం కూటమి నేతలు వణికి పోతున్నారంటూ మాట్లాడేస్తున్నారు. అయితే రైతులు మాత్రం జగన్ ఓదార్పు అంటూ చేయనున్న యాత్రపై పెదవి విరుస్తున్నారు. సీజన్ అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ప్రయోజనమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మా హయాంలో మేం రూ. 4 వేలు సబ్సిడీ ఇచ్చాం. మీ హయాంలో మీరేం ఇచ్చారని నిలదీస్తున్నారు స్థానిక తెలుగుదేశం లీడర్లు. ఈ రాజకీయ పోరాటాలను అటుంచితే.. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుకు ఇంత కష్టం ఎలా వచ్చిందో చూస్తే.. ఇక్కడ టేబుల్ రకాలను పక్కన పెట్టి.. తోతాపురి రకాలను ఎక్కువగా పండించారు. కారణం ఈ ప్రాంతంలో ఏకంగా 60 వరకూ గుజ్జు పరిశ్రమలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మామిడి రైతులు అధిక శాతం ఈ రకాలనే పండించారు. దానికి తోడు ఈ ఏడాది వర్షాలు కూడా సకాలంలో పడడంతో మామిడి దిగుబడి భారీగా పెరిగింది. దీంతో డిమాండ్ తగ్గింది. ఇదంతా అలా ఉంచితే.. ఇప్పటికే లక్ష క్వింటాళ్ల మామిడి గుజ్జు అలాగే నిల్వ ఉండి పోయింది. అంతర్జాతీయంగా ఏర్పడిన రాజకీయ వాతావరణం దృష్ట్యా ఈ గుజ్జును ఎగుమతి చేయలేక పోతున్నారు. స్థానికంగా అమ్మగలిగే రకాలను పక్కన పెట్టి.. ఇక్కడి పరిశ్రమలు కొంటాయన్న భావనతో పండించిన తోతాపురిని ఎవరూ కొనడం లేదు. ఆల్రెడీ ఉన్న నిల్వలను అమ్ముకోలేక పోవడంతో.. గుజ్జు పరిశ్రమలు మామిడిని కొనడం ఆపేశాయి. దానికి తోడు పరిశ్రమలన్నీ సిండికేట్ గా ఏర్పడి.. మేలో తెరవాల్సిన ఫ్యాక్టరీలు ఇంకా తెరవకుండా నానుస్తున్నారు. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాడు మామిడి రైతు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతును ఆదుకోవడంలో భాగంగా ఏకంగా 250 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇదే అదనుగా భావించిన మాజీ సీఎం జగన్ ఇక్కడా రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఏమిటంటే జగన్ రావడం వల్ల అనవసర అలజడి తప్ప మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదని రైతులు, మార్కెట్ యార్డు ప్రతినిథులు తెగేసి చెప్పడమే. అది ఆయన రాజకీయ లబ్ధి కోసం పోరాటమైతే.. ఇక్కడ రైతులది జీవన పోరాటం. వారి కడగండ్లను కూడా జగన్ క్యాష్ చేసుకోడానికి రావడం తమకు సుతరామూ ఇష్టం లేదంటున్నారు స్థానిక మామిడి రైతులు.
http://www.teluguone.com/news/content/jagan-bangarupalem-tour-takes-political-turn-39-201325.html





