వైఎస్ జగన్.. పరామర్శల్లేవు.. పెళ్లిళ్లకు హాజర్లే!
Publish Date:Mar 4, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం అంతా చాలా బిజీబిజీగా గడపనున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ పాల మరణాలు, బాణాసంచా పేలుడు ఘటన కారణంగా జరిగిన మరణాలు ఉన్నా.. జగన్ ఆయా సంఘటన బాధితులను పరామర్శించే పని పెట్టుకోలేదు. ఈ వారంలో ఆయన షెడ్యూల్ లో పెళ్లి వేడుకలకు హాజరు కావడం మాత్రమే ఉంది. తొలుత ఆయన సోమవారం కల్తీ పాల మృతుల కుటుంబాలను పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు చెప్పాయి. అయితే సోమవారం వచ్చింది. వెళ్లింది. కానీ జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ దాటి అడుగు బయటపెట్టలేదు. మంగళవారం (ఫిబ్రవరి 3)ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. ఆ సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క్ తాడేపల్లి ప్యాలెస్ ను విజిట్ చేసి తన కుమారుడి పెళ్లికి జగన్ ను ఆహ్వానించి, ఆహ్వానపత్రిక ఇచ్చారు. వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు. దీంతో అంతకు ముందు రోజే అమరావతిలో చంద్రబాబును కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన భట్టి, మరో సారి ఏపీకి వచ్చి జగన్ ను ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. సరే జగన్ భట్టి అందించిన ఆహ్వాన పత్రికను అందుకోవడం వినా మంగళవారం (మార్చి 3) మరో కార్యక్రమం పెట్టుకోలేదు. ఇక బుధవారం (మార్చి 4) జగన్ అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరయ్యారు. , ఆ తరువాత విశాఖ లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లారు. ఇటీవల వాసుపల్లి గణేష్ కుమారుడి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వాసుపల్లి నివాసానికి వెళ్లిన జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రెండు సందర్భాలలోనూ జగన్ భారీ జనసమీకరణ జరిగేలా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. తాడేపల్లికి తిరిగి వచ్చారు. సాధారణంగా జగన్ తన రెండుమూడు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనల్లో పరామర్శ యాత్రలకూ, తన నివసంలో ఏర్పాటు చేసే మీడియా సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ వారం మాత్రం ఆయన ఆనవాయితీని కాదని.. ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి, మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఆశీర్వదించి రావడానికే పరిమితమయ్యారు. మండలిలో లడ్డూ వివాదంపై రభస జరుగుతున్నా దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. రాజమహేంద్రవరంలో ఇటీవల కల్తీ పాలు కారణంగా మరణాలు సంభవించినా, కాకినాడ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడులో పలువురు మరణించినా.. ఆయా ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించాలని కూడా భావించలేదు.
http://www.teluguone.com/news/content/jagan-avoided-paramarsalu-25-214996.html





