జగన్మోహన్ రెడ్డి ఇక పూర్తి స్వేచ్చాజీవి
Publish Date:Oct 30, 2013
Advertisement
వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని అర్దరాత్రి పూట రేపల్లెకు బయలుదేరినప్పుడు, భగవంతుని మాయ వల్ల అయన చేతికీ, కాళ్ళకూ వేసిన సంకెళ్ళు, అయన బందింపబడ్డ ఖారాగారం తాళాలు ఒకటొకటిగా వాటంతటవే విడిపోగా, కాపలా ఉన్న భటులు నిద్రలోకి జారిపోగా, యమునా నది మధ్యకు విడిపోయి ఆయనకు ఏవిధంగా దారి ఇచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఆ పైవాడి కృప వలన కొందరు దుష్టులయిన సీబీఐ అధికారులు క్రమంగా జగన్మోహన్ రెడ్డి దారి నుండి అడ్డు తొలగిపోవడం, ఆయనపై వారు మోపిన ‘క్విడ్ ప్రో కేసులు’ కూడా వాటంతటవే విడిపోవడం, ఆయనకు క్లీన్ చిట్ రావడం, జైలు నుండి బయటపడటం అన్నీ ఏదో మాయలాగ చకచకా జరిగిపోయాయి. పైవాడి కృపని అర్ధం చేసుకోలేని కొన్ని 'తెలుగు జీవులు' వేరేవరి కృపవల్లనే ఇదంతా జరిగిపోతోందని అజ్ఞానంతో ఏమేమో మాట్లాడాయి. అయితే సీమాంద్రాలో ఉండిపోయిన తన పార్టీని చేరుకోవాలంటే మధ్యలో కృష్ణా, గోదావరి వగైరా నదులు అడ్డుపడుతున్నట్లు “హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళకూడదనే బెయిలు షరతు” ఒకటి మిగిలిపోయుంది. అయితే ఆ పైవాడి కృప మన మీద ఉండాలే గానీ ఈ నదులేమిటి సముద్రాలు కూడా దాటేయవచ్చునని అలనాడు హనుమంతులవారే నిరూపించారు. ఇక ఈ చిన్న పాటి నదులొక లెక్కా? తను రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడినని, అంతే గాక బాధ్యతగల యంపీనని (ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉండవచ్చుగాక, అది వేరే సంగతి) అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కష్టాలలో ఉన్న ప్రజలను ఓదార్చి వారి కన్నీళ్లు తుడవవలసిన అవసరం ఎంతయినా ఉన్నందున, తన బెయిలు షరతులను సడలించి తనను రాష్ట్రమంతటా పర్యటించేందుకు అనుమతించాలని ఆయన కోర్టుకు చేసుకొన్న విన్నపాన్ని కోర్టువారు సహృదయంతో అర్ధంచేసుకొని ఆయనకు రాష్ట్రమంతటా పర్యటించేందుకు అనుమతి మంజూరు చేసారీ రోజు. అందువల్ల అలనాడు వసుదేవుడిలా జోరువానలో నడుస్తూ శ్రమపడినట్లుగా, జగన్ కూడా పాదయాత్రలు చేసుకొంటూనో లేకపోతే అంత టైం మనకి లేదని భావిస్తే ఎంచక్కా ఏ విమానమో లేక తన లోటస్ పాండు నుండి నేరుగా హెలికాఫ్టర్ లోనో ఎగురుకొంటూ కృష్ణా, గోదావరి, శారద, నాగావళి, వగైరా నదులన్నిటినీ చిటికలో దాటేసి సీమాంద్రాలో ఎక్కడ కావాలంటే అక్కడ వాలిపోవచ్చునిపుడు. అందువల్ల తెదేపా నేతలు మళ్ళీ ఇది కూడా 'కుమ్మక్కు... కుమ్మక్కు' అంటూ ఆక్రోశించే అవకాశం ఉంది. అంతే గాక ‘పోరాడితే పోయేదేమీ లేదు విభజన చిచ్చు తప్ప(సంకెళ్ళు తప్ప) అనే నినాదంతో మొన్న హైదరాబాద్ లో సమైఖ్యసభ పెట్టి, తనకు సీమాంధ్రలో మంచి బలం ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి గట్టిగా నమ్మకం కలిగించిన తరువాతనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఆఖరి గేటు కూడా ఎత్తేసిందని తెదేపా ఆరోపిస్తే దాని అజ్ఞానికి అయ్యో పాపం! అనుకోక తప్పదు. అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి, లగడపాటి వంటి వారు కూడా మళ్ళీ దీనిని అపార్ధం చేసుకొనే ప్రమాదం ఉంది.
http://www.teluguone.com/news/content/jagan-39-27018.html





