ఉట్టికి ఎగుర లేన్నమ్మ...
Publish Date:Nov 9, 2013
Advertisement
తేదేపాకు చెక్ పెట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని బయటకి రప్పించిందని చంద్రబాబు ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే అతను తన సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్రలో పాగా వేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో మళ్ళీ కొత్తగా ఏమి చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఈ నెల16 నుండి 26వరకు దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా మొదలయిన రాష్ట్రాలు పర్యటించి అక్కడి పార్టీ నేతలతో మాట్లాడి తన సమైక్య ఉద్యమానికి మద్దతు కూడగట్టాలని, ఆ తరువాత తెలంగాణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సమైక్యాంధ్రప్రదేశ్’ యాత్ర చేయాలని నిశ్చయించుకొన్నారు. అయితే స్వంత రాష్ట్రంలోనే ప్రజల మద్దతు కూడా గట్టుకోలేని అతను అకస్మాత్తుగా దేశాటనకి బయలుదేరి ఇతర రాష్ట్రాల నేతల మద్దతు కూడ గట్టుకోవాలనుకోవడం ‘ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందన్నట్లు’ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరో 20-30 రోజుల్లో రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా పూర్తిచేసేందుకు కేంద్రం సిద్దం అవుతోందని తెలిసినప్పటికీ అతను దానిని అడ్డుపడే బదులు, దేశాటనకి బయలుదేరాలనుకోవడం చాలా అనుమానాలు రేకిత్తిస్తోంది. జగన్ పైకి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లుగా వ్యవహరిస్తూ, పరోక్షంగా అందుకు సహకరిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఇంతకాలం సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్ర మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగనీయమని చెపుతూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చి ఇప్పుడు ప్యాకేజీల గురించి ఏవిధంగా మాట్లాడుతున్నారో, ఇప్పుడు జగన్ కూడా సరిగ్గా అదేవిధంగా ప్రవరిస్తున్నారు.రాష్ట్రంలో ఉంటే, విభజనను వ్యతిరేఖిస్తూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది. కానీ విభజనను ఆపడం అతని ఉద్దేశ్యం కాదు గనుక ఆ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు వీలుగా దేశాటనకి బయలుదేరుతున్నారని అర్ధం అవుతోంది. విభజన ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో ప్రజల ముందుకు వచ్చి తను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎక్కని గుమ్మం లేదంటూ మొసలి కన్నీరు కార్చి, తనను ఎన్నుకొంటే కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెపుతానని సీమాంధ్ర ప్రజలను కోరడం ఖాయం. ఈవిధంగా ఒకే దెబ్బకు అనేక పిట్టలు కొట్టేయవచ్చని ఆయన ఆశ. అయితే వైకాపాకు ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమేనని తెదేపా మొదలుపేట్టబోయే ప్రచారానికి ఆయన ఏవిధంగా జవాబు చెపుతారో చూడాలి.
http://www.teluguone.com/news/content/jagan-37-27278.html





