ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.!
Publish Date:Oct 24, 2026
Advertisement
బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె వివాహం నిర్వహించడంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో విభేదాలు, వైరుద్ధ్యాలు, వైషమ్యాలను మరోసారి రచ్చకెక్కించాయి. సెక్యూరిటీ, వ్యక్తిగత భద్రత, ప్రాణహాని నెపంతో బెంగళూరు నివాసాన్ని వివాహానికి ఇవ్వలేనంటూ జగన్ రాసిన లేఖపై షర్మిల కుటుంబ సభ్యులు, వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహుతులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ లేఖకు బదులుగా ఆయనకు పలు ప్రశ్నలు, సవాళ్లతో కూడిన లేఖ రాశారు. గత కొంత కాలంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఆస్తుల పంపిణీ, రాజకీయ విభేదాల చుట్టూ వివాదాలు నడుస్తున్నసంగతి విదితమే ఈ క్రమంలోనే షర్మిల కుమార్తె అంజలి వివాహాన్ని బెంగళూరులోని వైఎస్ కుటుంబ నివాసంలో జరిపేందుకు సిద్ధమవ్వగా, భద్రతా కారణాలను ఉటంకిస్తూ, జగన్ యలహంక ప్యాలెస్ ను షర్మిల కుమార్తె వివాహ వేడుకకు వేదిక కావడానికి నిరాకరించారు. ఇదు కుటుంబ పరంగా విభేదాలు మరింత పెచ్చరిల్లేందుకు దోహదం చేయడమే కాకుండా, రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్ షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు. గతంలో లేని భయం ఇప్పుడేందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటు బాంబులు, కత్తుల సంస్కృతితో తీవ్ర ప్రాణాభయం ఉన్నప్పటికీ, కుటుంబంలోని పిల్లల పెళ్లిళ్లను ఎప్పుడూ ఆపలేదనీ, ఘనంగా నిర్వహించారనీ గుర్తు చేశారు. అంతే కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులను కూడా వివాహాది శుభకార్యాలకు ఆహ్వానించారని ఆ లేఖలో జగన్ కు గుర్తు చేశారు. వైఎస్ సోదరుల పిల్లలు, తోడబుట్టిన చెల్లెలు విమలమ్మ పిల్లల పెళ్లిళ్లు వైఎస్ ఇళ్లలోనే జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జార్జ్ రెడ్డి, అనిల్ రెడ్డి పెళ్లి, విమలమ్మ కొడుకు యువరాజ్, కుమార్తె దివ్య పెళ్లిళ్లు, రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రఘుదీప్ పెళ్లి, అలాగే సుధీకర్ రెడ్డి కుమార్తె విరోనికా రెడ్డి వివాహాలు వైఎస్ నివాసాల్లోనే ఘనంగా జరిగాయని ఉదాహరించారు. వైఎస్ ఎన్నడూ జగన్ లా పెళ్లిళ్లను, కుటుంబ వేడుకలను అడ్డుపెట్టుకుని ప్రాణహాని ఉందంటూ దాక్కోలేదని పేర్కొంటూ.. మేనకోడలి పెళ్లి వల్ల ప్రాణహాని ఉందన్న భయం ఉంటే జగన్ ఆ పది రోజులూ బెంగళూరు ప్యాలెస్ వైపు రాకుండా వేరే దేశానికో లేదా ప్రాంతానికో వెళ్లిపోవచ్చునంటూ హితవు పలికారు. యలహంక ప్యాలెస్‌లోని ఇరు భవనాలు, వాటి చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడలు వేరని గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసినా ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందని, అలాంటప్పుడు భద్రతా సమస్య ఎక్కడి నుంచి వస్తుందని ఆ లేఖలో షర్మిల కుటుంబం నిలదీసింది. షర్మిలకు కాబోయే వియ్యంకులు ఇప్పటికేబెంగళూరులోని షర్మిల రెసిడెన్సీ వేదిక అంటూ ఆహ్వానపత్రాలు ముద్రించి బంధువులకు పంచిన విషయం తెలిసి కూడా జగన్ ఇలా వివాహ వేదికను వద్దనడం తమ పరువు తీయాలన్న ఉద్దేశంతోనేనని దుయ్యబట్టారు. రెండు వైపులా కేవలం అత్యంత ముఖ్యమైన వందలాది మంది బంధువుల సమక్షంలో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఇలాంటి కుట్రలతో అడ్డుకోవడం ఏంటంటూ నిలదీశారు. మేనకోడలి పెళ్లికి రావడం, శుభకార్యంలో పాల్గొనడం ఇష్టం లేక సెక్యూరిటీ సాకు చూపిస్తూ, ప్యాలెస్ షర్మిలది కాదు, అదేమీ ఫంక్షన్ హాలు కాదు అంటూ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. పక్కనే ఉండి కూడా మేనకోడలి పెళ్లికి హాజరు కాలేదనే చెడు ముద్ర సమాజంలో పడకుండా ఉండేందుకే, ముందుగానే ఇలాంటి వివాదాలు సృష్టించి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తులు, రాజకీయాల పరంగా వస్తున్న విభేదాలు ఇప్పుడు నివాసాలు, శుభకార్యాల వేదికల వరకు పాకడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మేనకోడలి పెళ్లి విషయంలోనూ అన్నా చెల్లెళ్ల మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం నడవడం పట్ల వైఎస్సార్ అభిమానులు , కుటుంబ శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. [Jagan, YS Sharmila Strong Counter, Jagan, Yelahanka Palace, Life Thret, Letter, Sharmila Daughter Marriage, YS Rajasekhara Reddy Family, Telugu One]
http://www.teluguone.com/news/content/jagan-39-235233.html




