ఏపీ మద్యం స్కామ్ కేసులో రంగంలోకి దిగిన ఐటీ
Publish Date:May 2, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌లో ఐటి అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ స్కామ్ ద్వారా రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆ మొత్తానికి సంబంధించిన పన్ను వివరాలను సేకరించే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమంగా సేకరించిన నగదులో కొంత భాగం విదేశాలకు తరలించిననట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని దుబాయ్ కి పంపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డబ్బు తరలింపు పద్ధతి, విదేశీ లింకులు, లబ్ధిదారులపై ఇప్పుడు ఐటీ విచారణ కేంద్రీకృతమైంది. ఈ వ్యవహారం ద్వారా ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు అక్రమ నగదు జనరేట్ అయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఎక్కువగా బ్లాక్ మనీ రూపంలో చలామణి అయినట్టు భావిస్తున్నారు. డిజిటల్ ట్రైల్ బయటపడకుండా ఉండేందుకు ఎక్కువ లావాదేవీలు నగదు రూపంలో నిర్వహించినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. డిస్టిల్లరీలు, వెండర్లకు ఐదు సార్లు ఎక్కువగా చెల్లింపులు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఎలాంటి మెటీరియల్ సప్లై జరగకపోయినా ఫేక్ ఇన్వాయిస్‌లతో చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. రెండు డిస్టిల్లరీలు కలిపి రూ.76.92 కోట్లు నకిలీ బిల్లింగ్ ద్వారా తరలించినట్టు ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో వెండర్లకు ఐదు రెట్లు అధికంగా చెల్లింపులు చేసినట్టు గుర్తించడం ఈ కేసులో కీలక అంశంగా మారింది. డిజిటల్ ట్రైల్ బయటపడకుండా ఉండేందుకు లాభాలను పూర్తిగా బ్లాక్‌లో దాచిపెట్టినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, త్వరలోనే మరిన్ని సోదాలు, నోటీసులు జారీ అయ్యే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
http://www.teluguone.com/news/content/it-department-steps-in-to-ap-liquor-scam-case-36-218793.html





