ఆనందయ్య మందుతో వైసీపీ ఎమ్మెల్యే బిజినెస్!
Publish Date:Jun 5, 2021
Advertisement
కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై మళ్లీ వివాదం రాజుకుంది. ఆనందయ్య మందు కోసం రూపొందించారని ప్రచారం జరుగుతున్న వెబ్ సైట్ ఫేక్ అని తేలింది. ఆనందయ్య మందును ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అందిస్తారని నాలుగైదు రోజులుగా ప్రచారం జరుగుతోంది. మందు కోసం Childeal.comలో బుక్ చేస్తే ఇంటికే మందును పంపిస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆనందయ్య మందు కోసం చాలా మంది ఈ వెబ్ సైటులో నమోదు చేసుకున్నారు. మందును ఫ్రీగా ఇస్తానని ఆనందయ్య చెప్పగా.. ఈ వెబ్ సైట్ లో మాత్రం రేటు కూడా పొందపరిచారు. దీంతో కొందరిలో అనుమానాలు తలెత్తాయి. ఆనందయ్య మందు పంపిణిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. వెబ్ సైట్ పై క్లారిటీ ఇచ్చింది. Childeal.com ద్వారా ఆనందయ్య ఆయుర్వేదం మందును పంపిణీ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని తెలిపింది. అయితే Childeal.com వెబ్‌సైట్‌కు సంబంధించి టీడీపీ నేత సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న మందును రూ.167కు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రేషిత టెక్నాలజీ ద్వారా వెబ్‌సైట్‌ను రూపొందించారని.. ఈ కంపెనీలో వైసీపీ నేతలే డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. వెబ్సైట్లో మందు వివరాలు, ధరను పేర్కొన్నారని.. కానీ మళ్లీ డిలీట్ చేశారని ఆరోపించారు. ఆనందయ్య మందు పేరిట ఫేక్ వెబ్సైట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కోటి మందికి ఆన్లైన్లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి కుటిల ప్రయత్నం చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. ఆనందయ్య మందుకు ఫ్యాను గుర్తు పెట్టడం ముఖ్యమంత్రిని దిగజార్చడమే అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలను నిలదీసే దమ్ము, ధైర్యం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎస్పీ, కలెక్టర్లకు లేదన్నారు. సుమోటోగా కుట్రపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. తాము మోమోరాండం ఇవ్వడానికి సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం, హైకోర్టు అనుమతి ఇచ్చింది. నోటిద్వారా తీసుకునే మందు పంపిణీకి మాత్రమే అనుమతి ఉంది. కంటిలో వేసే మందుకు ఇంకా అనుమతి రాలేదు. ఆనందయ్య మందుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో.. పంపిణి మళ్లీ మొదలవుతుందని అంతా భావించారు. మూడు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టులో మందు పంపిణి ప్రారంభమైందని, సోమవారం నుంచి పంపణి చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఆన్ లైన్ లో మందు పంపిణికి ఏర్పాట్లు చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రకటన వచ్చింది. అంతా సాఫీగా జరుగుతుందనుకుంటున్న సమయంలో సీన్ మొత్తం మారిపోయినట్లు కనిపిస్తోంది. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణి కష్టమేనని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మందు పంపిణికి సమస్యలు వస్తున్నాయని ఆనందయ్య అనచురులు, కృష్ణపట్నం గ్రామస్తులు చెబుతున్నారు. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వ సహకారం లేదని... మందు పంపిణీ జరగదని.. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు తెలిపారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారన్నారు. ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు మాత్రమే తయారు చేయగలరన్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా లక్షల మందికి పంపిణీ చేయమనడం సరికాదన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక, ఆనందయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వం సహాకారం అందిస్తేనే మందు పంపిణీ సాధ్యమన్నారు. ఆన్ లైన్లో మందు ఇవ్వలేమని సంపత్ రాజు వెల్లడించారు. ఈ మేరక ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.
http://www.teluguone.com/news/content/is-ycp-mla-behind-anandaiah-medicicne-fake-website-39-117006.html





