వేసవిలో చల్లనీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?
Publish Date:May 29, 2026
Advertisement
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది. బాగా చల్లగా ఉన్న నీరు శరీరానికి మేలు చేయదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, తీవ్రమైన వేడి వల్ల శరీరం ఇప్పటికే వేడెక్కి ఉన్నప్పుడు, అకస్మాత్తుగా బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగడం చాలా మందికి అసౌకర్యాన్ని, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందట. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎండ నుండి వచ్చాక చల్లని నీరు ఎందుకు తాగకూడదు? వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం ఎండలో నుండి లోపలికి వచ్చినప్పుడు, శరీరం తనను తాను చల్లబరుచుకునే ప్రక్రియలో నిమగ్నమై ఉంటుంది. ఈ సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది , శరీరం తన ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా చాలా చల్లటి నీటిని తాగడం వల్ల ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కలగవచ్చు. దీన్నే టెంపరేచర్ షాక్ అని అంటారు. దీనివల్ల రక్తనాళాలు అకస్మాత్తుగా సంకోచించి, తలనొప్పి, కళ్లు తిరగడం లేదా అసౌకర్యం వంటి సమస్యలకు దారితీయవచ్చు. సమస్య ఇదే.. చల్లటి నీరు నోరు, గొంతుకు తక్షణ చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే చల్లనీరు తాగితే హాయిగా ఫీలవుతారు. అయితే, శరీరం నెమ్మదిగా చల్లబడాలి. అతి చల్లటి నీరు జీర్ణవ్యవస్థను తాత్కాలికంగా మందగింపజేస్తుంది. దీనివల్ల జీర్ణ ఎంజైమ్‌ల పనితీరు తగ్గి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపు మరింత కష్టపడాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. చెమట పట్టగానే చల్లనినీరు తాగితే సమస్యే.. చెమట పట్టిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతులో చికాకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల గొంతు నొప్పి, శ్లేష్మం అధికంగా ఉత్పత్తి కావడం, దగ్గు, , గొంతులో అసౌకర్యం వంటివి కలగవచ్చు. చల్లని పదార్థాల వల్ల సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఏం చేయాలి? అతి చల్లగా ఉన్న నీరు కొంతమందిలో బ్రెయిన్ ఫ్రీజ్, అంటే ఆకస్మిక తలనొప్పిని ప్రేరేపిస్తుందట. నోరు , గొంతులోని సున్నితమైన నరాలపై చల్లని నీరు అకస్మాత్తుగా ప్రభావం చూపినప్పుడు ఇది జరుగుతుంది. ముందు నుంచే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా చాలా చల్లటి నీరు సరిపడదు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు వేగస్ నాడిపై ప్రభావం చూపి, తాత్కాలికంగా హృదయ స్పందన రేటు , రక్తపోటును ప్రభావితం చేస్తాయి. ఎండలో నుండి వచ్చిన వెంటనే అతి చల్లని నీరు తాగే బదులు, కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత నెమ్మదిగా నార్మల్ వాటర్ కొద్దిగా తాగి ఆ తర్వాత చల్లని నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. మట్టి కుండ నీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు , ఓఆర్ఎస్ వంటివి శరీరానికి మరింత మెరుగ్గా తేమను అందించడంలో సహాయపడతాయి. కాబట్టి చల్లనీరుకు బదులు ఇవి ట్రై చేయడం ఆరోగ్యానికి, ప్రాణానికి మంచిది. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/is-drinking-too-much-cold-water-in-summer-really-healthy-34-221214.html





