రూ. 35 కోసం రెండేళ్ల పోరాటం.. అయినా రూ. 2 కోత
Publish Date:May 9, 2019
Advertisement
కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి విలువైనదే. ఈ మాటని ఓ వ్యక్తి బలంగా నమ్మాడు. అందుకే భారత రైల్వే నుంచి తనకు రావాల్సిన రూ. 35 రిఫండ్ కోసం రెండేళ్ల పాటు పోరాటం చేసాడు. ఆయన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కాకపోతే రూ. 35కు బదులుగా రూ. 33 రీఫండ్ వచ్చింది. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన సుజీత్ స్వామి 2017 జులై 2న ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం దాదాపు రెండు నెలల ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నారు. కోటా నుంచి ఢిల్లీకి టికెట్ ధర రూ. 765గా ఉంది. అయితే వెయిటింగ్ జాబితా ఎక్కువగా ఉండటంతో కొద్ది రోజుల ముందు సుజీత్ టికెట్ రద్దు చేసుకున్నారు. సాధారణంగా వెయిటింగ్ జాబితాలో ఉన్న టికెట్‌ను రద్దు చేసుకొంటే రూ. 65 ఛార్జ్ చేసి మిగతా మొత్తం రీఫండ్ చేస్తారు. కానీ సుజీత్‌కు మాత్రం రూ. 100 తగ్గించి రూ. 665 రీఫండ్ చేశారు. అయితే తనకు రూ. 100 ఛార్జ్ చేయడంతో సుజీత్ రైల్వేశాఖను సంప్రదించారు. అదే ఏడాది జీఎస్టీ అమల్లోకి రావడంతో మిగతా రూ. 35 సర్వీస్ ట్యాక్స్ కింద ఛార్జ్ చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే తాను జీఎస్టీ అమల్లోకి రావడానికంటే ముందే టికెట్‌ను రద్దు చేసుకున్నానని, ఛార్జ్ చేసిన రూ. 35 తనకు ఇవ్వాలని సుజీత్ ఐఆర్సీటీసీని కోరారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2018 ఏప్రిల్‌లో లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సహచట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇలా రెండేళ్ల పాటు రైల్వేశాఖతో ఆయన పోరాటం చేశారు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించి మే 1న ఆయన ఖాతాలో రూ. 33ను ఐఆర్సీటీసీ జమ చేసింది. అయితే ఇన్నాళ్ల పాటు తనను ఎంతో వేదనకు గురి చేసి ఇప్పుడు రీఫండ్ నుంచి రూ. 2 తగ్గించారని సుజీత్ వాపోయారు. దీనిపై తాను మళ్లీ పోరాడుతానని చెప్పారు. కేవలం రూ. 35 కోసం రెండేళ్ల పాటు పోరాటం చేయడమేంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం చిన్న విషయమైనా మనవైపు తప్పు లేనప్పుడు నిజాయితీగా పోరాడడంలో తప్పులేదు అని అభినందిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/irctc-refunded-33-rupees-to-passenger-after-2-years-fight-39-86904.html





