ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మాసాబ్ ట్యాంక్ పిఎస్ లో విచారణ
Publish Date:Jan 17, 2025
Advertisement
తన విధులకు ఆటంకం కలిగించినట్టు గత నెలలో బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ రాఘవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.
తన ఫోన్ ట్యాప్ అవుతుందని గత నెల నాలుగో తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి వచ్చారు. ఇదే సమయంలో బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్
రాఘవేందర్ స్టేషన్ నుంచి బయటకు వెళుతున్నారు. తాను వస్తున్న విషయాన్ని ముందే ఇన్స్ పెక్టర్ రాఘవేందర్ పసిగట్టి స్టేషన్ నుంచి వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి వాదన. తన వాహనాన్ని అడ్డుకున్నట్లు రాఘవేందర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉంది. విచారణ కోసం కౌశిక్ రెడ్డి విచారణాధికారిగా ఉన్న మాసాబ్ ట్యాంక్ ఇన్స్ పెక్టర్ ఎదుట హాజరయ్యారు. విచారణాధికారి ప్రశ్నలకు కౌశిక్ రెడ్డి సమాధానాలిచ్చి ఇంటికి వెళ్లిపోయారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి నిన్ననే మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు హాజరుకావాల్సి ఉంది. ఒక కేసు విషయంలో కరీంనగర్ కోర్టుకు హాజరు కావల్సి ఉన్నందున శుక్రవారం హాజరౌతానని కౌశిక్ రెడ్డి పోలీసులకు ముందుగానే తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడు బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ కావడంతో విచారణాధికారిగా మాసాబ్ ట్యాంక్ ఇన్స్ పెక్టర్ పరశురాంను నియమించారు. పరశురాం ఇచ్చే నివేదికను బట్టి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/investigation-of-mla-kaushik-reddy-in-masab-tank-ps-25-191420.html





