టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం.. మరో ఎంపీ రాజీనామా
Publish Date:Jun 10, 2026
Advertisement
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తరువాత పార్టీలో ఎగసిపడిన అసమ్మతి జ్వాలలు ఢిల్లీ వరకూ విస్తరించాయి. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్. సుస్మితా దేవ్ తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆ లేఖలో కోరారు. కాగా రాజీనామా సమర్పించిన కొద్దిసేపటికే.. అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత హిమంత బిశ్వ శర్మ నివాసంలో సుస్మితాదేవ్ ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుస్మితాదేవ్ త్వరలోనే కాషాయ జెండా కప్పుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ భేటీపై విలేకరులు ప్రశ్నించగా.. ఇది కేవలం 'అస్సాం కనెక్షన్' మాత్రమేనని, అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆమె బదులిచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సుస్మితా దేవ్.. అస్సాం కాంగ్రెస్ దిగ్గజం అల్లాడి సంత్ మోహన్ దేవ్ కుమార్తె. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా, సిల్చార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా సుదీర్ఘ సేవలు అందించారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్‌ను వీడి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఈమె చేరికతో ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాం, త్రిపురలలో పార్టీ బలోపేతం అవుతుందని టీఎంసీ భావించింది. కానీ, బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన సమీకరణాలతో ఆమె పార్టీ వీడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
http://www.teluguone.com/news/content/internal-crisis-deepens-in-tmc-39-222460.html





