అవిశ్వాసంలోనూ ఇందిరమ్మదే రికార్డు!
Publish Date:Jul 27, 2023
Advertisement
స్వాతంత్ర భారత రాజకీయాల్లో దివంగత ప్రధాని ఇందిరా గాంధీది ప్రత్యేక స్థానం. ఒకటీ రెండూ కాదు అనేక విషయాల్లో ఆమె చరిత్రను సృష్టించారు. అవును ప్రస్తుతం దేశంలో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న అవిశ్వాస తీర్మానం చర్చలోనూ ఇందిరా గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధానిగా ఇందిరా గాంధీ రికార్డుల కెక్కారు. అవును. ఇంత వరకు స్వాతంత్ర భారత చరిత్రలో ప్రతిపక్ష పార్టీలు 27 సార్లు అవిశ్వాసం ప్రవేశ పెడితే, ఒక్క ఇందిరా గాంధీ ప్రభుత్వంమే 15 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కుంది. అదొక రికార్డు అయితే, అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్న అన్ని (15) అన్ని సార్లు ఇందిర ప్రభుత్వమే నెగ్గింది. అంతే కాదు.దేశంలో ఇంతవరకు ప్రభుత్వాలు 27 సార్లు అవిశ్వాసం తీర్మానం ఎదుర్కున్నా, కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ప్రభుత్వం కూలి పోయింది, మిగిలిన అన్ని సందర్భాలలోనూ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంది. మొదటిసారి 1979లో మొరార్జీ దేశాయ్.. రెండవసారి 1999లో అటల్ బిహార్ వాజ్‌పేయ్‌లు ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అత్యధికంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధానిగా రికార్డుకెక్కిన ఇందిరా గాంధీ మాత్రం అన్ని సందర్భాలలో సభ విశ్వాసం పొందారు. విజయం సాధించారు. అదలా ఉంటే, స్వాతంత్ర భారత తొలి ప్రధాని జవహర లాల్ నెహ్రూ ... మొట్టమొదటి సారిగా 1963 (మూడవ లోక్ సభ)లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్నారు. నెగ్గారు. అయితే 1952 లోక్ సభ నిబంధనలలో అవిశ్వాస తీర్మానం నిబంధనలు పొందు పరిచిన తర్వాత 1963 అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన జేబీ కృపలానీ నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.అంతకు ముందు తొలి రెండు సభల్లో అవిశ్వాసం అవసరం రాలేదు. ప్రతిపక్ష పార్టీలు ఆ ప్రయత్నం చేయలేదు. అదలా ఉంటే, కృపలానీ ప్రవేశ పెట్టిన తొలి అవిశ్వాస తీర్మానాన్ని నెహ్రూ స్వాగతించారు. తీర్మానం పై నాలుగు రోజుల పాటు, 21 గంటలకు పైగా జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు, చరిత్ర పుటల్లో నిలిచి పోయాయి. ఆ తర్వాత 1964లో లాలబహదూర్ శాస్త్రి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కుంది. ఇక అక్కడి నుంచి 1964 – 1975 మధ్యలో 15 మార్లు లోక్ సభలో అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగింది. అందులో మూడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన తీర్మానాలు అయితే, మిగిలిన 12 ఇందిరా గాంధీ ఖాతాలో చేరాయి. ఇవిగాక, 1981- 1982 మధ్యలో ఇందిరా గాంధీ మరో మూడు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కున్నారు. దిగ్విజయంగా దాటేశారు. ఆవిధంగా తొలి అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్న నెహ్రూ కోరుకున్న విధంగా, ఆయన కుమార్తె ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కుని.. నెగ్గారు. చరిత్రను సృష్టించారు.
అవిశ్వాస తీర్మానం లక్ష్యం, అధికారంలో ఉన్న పార్టీ గద్దె దింపి,తాము అధికారంలోకి రావడం, అయితే. ప్రస్తుత తీర్మానం లక్ష్యం అది కాదు... అటువంటి అంచనాలు కానీ, ఆశలు కానీ లేవు. అయినా, చర్చ ఆసక్తి దాయకంగా, ప్రయోజనకరంగా సాగింది. అందులో అవాస్తవాలున్నా, నేను వ్యక్తిగతంగా చర్చను స్వాగతిస్తున్నాను. అంతే కాదు, మనం అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెట్టుకోవడం మంచిదని భావిస్తున్నాను అంటూ చరిత్రలో నిలిచి పోయే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
http://www.teluguone.com/news/content/indira-gandhi-faced-noconfidence-27-times-25-159070.html





