ఎనిమిది నెలల వ్యవధిలో మోడీతో లోకేష్ భేటీలు ఐదు... సంకేతమేంటి?
Publish Date:Sep 8, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కు ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ అడగనవసరం లేకుండానే దొరికేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మోడీయే స్వయంగా నారా లోకేష్ ను కుటుంబంతో సహా ఢిల్లీ వచ్చి తనను కలవాలంటూ ఆహ్వానించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మహామహా సీనియర్లు, దిగ్గజ నేతలకు సైతం ఇంత తక్కవ వ్యవధిలో ఇన్ని సార్లు ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ లభించిన దాఖలాలు లేవు. అంతెందుకు హిందుత్వను భుజాన వేసుకుని నిత్యం మోడీ విధానాలను పొగిడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పటి వరకూ లోకేష్ కు లభించిన అప్పాయింట్ మెంట్లలో సగం కూడా దొరకలేదు. లోకేష్ కు ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని సార్లు మోడీ అప్పాయింట్ మెంట్లు లభించడంపై దేశ వ్యాప్తంగా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇది దేనికి సంకేతమన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. అప్పాయింట్ మెంట్లు లభించడమే కాదు.. ఆ సందర్భంగా ఇరువురి మధ్యా సుదీర్ఘ చర్చలు కూడా జరుగుతున్నాయంటున్నారు. సాధారణంగా ఎంత కీలకమైన వ్యక్తి అయినా సరే మోడీ అప్పాయింట్ మెంట్ ఇచ్చేది పావు గంట.. మహా అయితే మరో పది నిముషాలు. అయితే లోకేష్ ఆయనతో భేటీ అయిన ప్రతిసారీ ఆ భేటీ గంట, ముప్పావుగంట సాగుతోంది.అయితే ఢిల్లీ బీజేపీ వర్గాలు మాత్రం ప్రధాని మోడీ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిభ, పరిణితి ఉన్న యువనేతలకు గుర్తించి, వారిని ప్రోత్సహిస్తుంటారనీ, సీనియర్ నేతల కంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మామూలేనని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోకేష్ లో అటువంటి పరిణితి చెందిన, ప్రతిభావంతుడైన యువనేత లోకేష్ అని గుర్తించిన మోడీ ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో పోలిటికల్ సర్కిల్స్ లో ప్రధాని మోడీతో లోకేష్ వరుస భేటీలు రాష్ట్ర రాజకీయాలలో రాబోతున్న మార్పునకు కూడా సంకేతమని అంటున్నారు. లోకేష్ కు పార్టీలో పదోన్నతి విషయంలో గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కారణాలేమైతేనేం.. ఆ తరువాత ఆ ప్రస్తావన పెద్దగా రాలేదు. ఇప్పుడు ప్రధాని మోడీతో లోకేష్ వరుస భేటీలు.. లోకేష్ కు ప్రమోషన్ విషయంలో బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలూ ఉండవన్న సంకేతాన్ని ఇస్తున్నదని, ఆ సంకేతం జనసేన కూడా లోకేష్ కు పదోన్నతికి అంగీకారం తెలిపేలా చేస్తుందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/indication-behind-pm-modi-series-of-appointments-to-lokesh-39-205792.html





