ఆపరేషన్ సింధూర్.. పీవోకేలోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు
Publish Date:May 6, 2025
Advertisement
భారత్ అన్నంత పనీ జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి తప్పక బదులు తీర్చుకుంటాని ప్రకటించిన భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. మంగళవారం (మే6) అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట నలభై నాలుగు నిమిషాల సమయంలో ఒక్కసారిగా పీవోజేకేలోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇప్పటికే బిక్కు బిక్కుమని బతుకుతున్న ఉగ్రవాదులకు భారత వైమానిక దళాల దాడులతో దిమ్మ తిరిగిపోయింది. పాక్ లోని ఉగ్ర వాదులుండే స్థావరాలను ఖచ్చితంగా టార్గెట్ చేసిన భారత సైన్యం.. దుమ్ము రేపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులకు పాల్పడింది. ఈ దాడి ఉగ్రస్థావరాలపైనే కానీ పాకిస్థాన్ సైనిక స్థావరాలపై కాదని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. ముఖ్యంగా లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ మురిడ్కే, జైష్ ఏ మహమద్ కేంద్ర స్థానం బహవల్పూర్ లో ఈ దాడులు జరిపింది. పాక్ ఆర్మీ సైతం ఈ దాడులు జరిగినట్టు ప్రకటించింది. ఈ దాడులలో పలువురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరింత మంది గాయపడ్డారు. అయితే పాక్ ఆర్మీ మాత్రం ముగ్గరు మృతి చెందగా, 12 మంది క్షతగాత్రులయ్యారని ప్రకటించింది. ఇదిలా ఉంటే బుధవారం (మే 7) దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నడుపుతున్న వేళ.. పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేయడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ చేసిన ఈ దాడులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ భారత్ మాతాకీ జై అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత సైన్యం న్యాయం జరిగింది. జైహింద్ అని ట్వీట్ చేసింది. అయితే ఇదే దాడి అంశంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. సైతం స్పందించారు. మోసపూరితంగా శతృవు తమపై దాడి జరిపిందనీ.. ఈ దాడికి బదులు చెబుతామని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్ రాజౌరి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. దీన్ని సమర్ధవంతంగా తిప్పి కొట్టారు భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారు.
http://www.teluguone.com/news/content/indian-army-attacks-on-terrorists-bases-in-pok-25-197596.html





