టర్కీకి భారత్ ఝలక్.. సెలిబి యేవిషేషన్ భద్రతా అనుమతులు రద్దు
Publish Date:May 16, 2025
Advertisement
నమ్మక ద్రోహానికీ, విశ్వాస ఘాతుకానికీ పాల్పడిన టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశ సంస్థ సెలిబి ఏవియేషన్ కు భద్రత అనుమతిని రద్దు చేసింది. ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టర్కీ పాకిస్థాన్ కు పూర్తి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో భారీ భూకంపంలో టర్కీ దయనీయ స్థితిలో ఉన్న సమయంలో భారత్ దోస్త్ అంటూ ఆ దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. అపత్సమయంలో ఆపన్న హస్తం అందించిన భారత్ విషయంలో టర్కీ వ్యవహరించిన తీరుకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇండియాలో అయితే టర్కీ ఉత్పత్తులు, కంపెనీలను బ్యాన్ చేయాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా పాలు పోసిన చేతినే పాములా కాటేసిన టర్కీకి ఇండియా గట్టి గుణపాఠం చెప్పింది. టర్కీ సంస్థ సెలెబి ఏవియేషన్‌కు భద్రతా అనుమతిని భారత్ రద్దు చేసింది. టర్కీకి చెందిన సెలిబి ఏవియేషన్ సంస్థ భారత్ లోని తొమ్మిది విమానాశ్రయాలలో హై సెక్యూరిటీ పనులను నిర్వహిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన భద్రతా అనుమతిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఉగ్రవాదానికి దన్నుగా నిలిచిన పాకిస్థాన్ కు టర్కీ మద్దతు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ చర్య తీసుకుంది. అంతే కాదు ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలను తెంచుకోబోతోందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. తొట్టతొలిగా జాతీయ భద్రత దృష్ట్యా టర్కీ సంస్థ సెలిబీ ఏవియేషన్ భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1958లో స్థాపించబడిన సెలెబి కంపెనీ... టర్కీలో మొట్టమొదటి ప్రైవేట్ యాజమాన్యంలోని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 70 విమానాశ్రయాలలో తన సేవలను అందిస్తున్నది. భారత్ పాకిస్థాన్ మథ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో టర్కీ పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బాయ్‌కాట్ టర్కీ అన్న నినాదం జోరందుకుంది. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన సెలిబి యేవియేషన్ సంస్థ భద్రతా అనుమతిని కేంద్రం రద్దు చేయడం అంటే ముందు ముందు ఆ దేశంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంబంధాలనూ రద్దు చేసేకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/india-shock-to-turkey-39-198154.html





