పశ్చిమ ఆసియా శాంతి స్థాపనలో భారత్ కీలకం
Publish Date:Apr 14, 2026
Advertisement
కంఠమనేని సీతారాం అంతర్జాతీయ రాజకీయ యవనికపై పశ్చిమ ఆసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ గడిచిన ఆదివారం జరిగిన శాంతి చర్చలు చివరి నిముషంలో విఫలం కావడం పరిస్థితిని మరింత దిగజార్చి, ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశలో గురువారం (ఏప్పిల్ 14) మరో విడత చర్చలకు రంగం సిద్ధమైనా అవి ఏ మేరకు ఫలితాలిస్తాయన్న అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం అనుసరిస్తున్న సంతులన దౌత్య విధానం పట్ల ఇరాన్ అగ్రనేతలు ప్రశంసలు కురిపించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది. ఆ ఒక్క ఫోన్ కాల్ శాంతి ప్రక్రియను పట్టాలు తప్పించింది. ఇరాన్ డిమాండ్లు, పాక్ పాత్రపై సందేహాలు.. ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా వైఖరిని ఎండగట్టారు. తమ దేశ హక్కులను గౌరవించి, ఆధిపత్య ధోరణిని వీడితేనే చర్చలు సఫలమవుతాయని ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఇదే సమయంలో ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ సామర్థ్యంపై అమెరికా మాజీ సైనిక అధికారి డగ్లస్ మాక్‌గ్రెగర్ తీవ్ర విమర్శలు చేశారు. కాలిపోతున్న భవనంలో ఆశ్రయం ఇచ్చిన చందంగా పాక్ ప్రయత్నాలు ఉన్నాయని, ఇజ్రాయెల్ వంటి దేశాలు పాకిస్తాన్‌ను ఏమాత్రం విశ్వసించవని ఆయన నిర్మొహమాటంగా, నిష్కర్షగా చెప్పారు. పాక్ కంటే భారత్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సయీద్ రెజా మోసయెబ్ మోట్లాగ్ భారతదేశం పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ప్రత్యేకంగా అభినందించారు. యుద్ధం లేదా సైనిక జోక్యం కంటే దౌత్యపరమైన పరిష్కారాలకే భారత్ మొగ్గు చూపుతోందని, ఇది ప్రాంతీయ స్థిరత్వానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. చైనా, రష్యాలతో పాటు భారత్ శాంతిని నెలకొల్పడంలో నిజాయితీగా వ్యవహరిస్తోందని కితాబు ఇచ్చారు. ప్రధాని మోదీకి ఉన్న అంతర్జాతీయ పలుకుబడి, ప్రపంచ నేతలతో ఆయనకున్న సంబంధాలు ఈ సంక్షోభ నివారణకు ఎంతో తోడ్పడతాయని విదేశీ నిపుణులు సైతం చెబుతున్నారు.
ఇదే సమయంలో ఇజ్రాయెల్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. పాకిస్తాన్‌ను బహిరంగంగానే ఉగ్రవాద దేశంగా ఇజ్రాయెల్ అభివర్ణించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇరాన్‌తో పాక్ సంబంధాలు, ఉగ్రవాదానికి ఆ దేశం ఇస్తున్న మద్దతును ఇజ్రాయెల్ తప్పుబట్టింది. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. శాంతి చర్చల పరోగతికి భారత్ వంటి దేశాల చొరవ అనివార్యమని ప్రపంచ దేశాలు సైతం భావిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/india-key---establishing-peace-in-west-asia-45-217339.html




