బంగ్లా బేబీలతో భారత్ ఆడేసుకొంటుందా?
Publish Date:Mar 18, 2015
Advertisement
ఇంతవరకు జరిగిన ఆరు ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లలో జైత్రయాత్ర సాగిస్తూ వచ్చిన భారత్ మెల్ బోర్న్ లో ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతోంది. మరికొద్ది సేపటిలో మెల్ బోర్న్ లో మ్యాచ్ మొదలవుతుంది. బంగ్లాదేశ్ టీం ని బంగ్లాబేబీలని భారత్ అభివర్ణిస్తున్నప్పటికీ, ఆ బేబీలే ఇంగ్లాండ్ వంటి గొప్ప జట్టును డ్డీకొని నాకౌట్ దశకు చేరుకొన్న విషయం మరిచిపోకూడదు. మొట్టమొదటిసారిగా నాకవుట్ స్థాయికి చేరుకోవడమే దానికి చాలా గొప్ప విషయం. ఈ దశకు చేరుకొన్న తరువాత ఎవరిని డ్డీ కొనవలసివచ్చినా వారు తనకంటే చాలా బలమయినవారే అయ్యుంటారనే సంగతి బంగ్లాదేశ్ కి తెలియకపోదు. అయినా ఈ స్థాయికి చేరుకోవడమే మహాభాగ్యమని భావిస్తున్న బంగ్లా టీం ఈ మ్యాచ్ లో గెలిస్తే అంతకంటే దానికి సంతోషం కలిగించేది మరొకటి ఉండబోదు. ఒకవేళ ఓడిపోయినా దిగులుపడాల్సిన అవసరం కూడా లేదు. కనుక బంగ్లా టీం ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడుకోవచ్చును. వరుస విజయాలతో దూసుకువెళుతున్న భారత్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. కనుక బంగ్లా బేబీని ఉతికి ఆరేస్తామని చెపుతోంది. కానీ ఇంగ్లాండ్ టీంకే జలక్ ఇచ్చిన బంగ్లా బేబీలను తక్కువగా అంచనా వేసుకొని, ఆత్మవిశ్వాసం బదులు అతివిశ్వాసం ప్రదర్శిస్తే అదే బంగ్లా బేబీ చేతిలో భారత్ కు పరాభవం ఎదురయ్యే ప్రమాదం ఉంది. కనుక చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా భారత్ ఆడవలసి ఉంటుంది. భారత్ జట్టులో ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రహానే, రైనా, జడేజా, అశ్విన్, ఉమేశ్, షమీ, మోహిత్ ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టులో మొర్తజా (కెప్టెన్), తమీమ్, కైస్, సర్కార్, మహ్ముదుల్లా, షకీబ్, ముష్ఫికర్, రహమాన్, సన్నీ/నాసిర్, రూబెల్, తస్కీన్ ఉన్నారు.
http://www.teluguone.com/news/content/india-39-44236.html





