సర్వీస్ సెక్టార్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంపు.. చంద్రబాబు
Publish Date:Jun 10, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలను మరింత చేరువ అవుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే డిజిటల్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 300 సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేసిన తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రభుత్వం.. గ్రామీణ పేదలకు మరింత చేరువ అయ్యే లక్ష్యంతోనే స్వర్ణాంధ్ర కార్యాలయాలను తీసుకువచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. సర్వీస్ సెక్టార్ నుంచి ఆదాయం పెంచడం ద్వారా ఆ పెంచిన ఆదాయాన్ని పేదలకు మరిన్ని పథకాలను అమలు చేయడం ద్వారా అందిస్తామన్న చంద్రబాబు.. ప్రస్తుతం సేవా రంగం ద్వారా నూటికి ఆరు రూపాయల ఆదాయం వస్తున్నదని, దీనిని మరింత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు. ఈ స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకు వెడతామన్న చంద్రబాబు.. జగన్ ప్రభఉత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తా మన్న చంద్రబాబు రాజధాని అమరావతిని కూడా మరో మూడేళ్లలోనే పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
http://www.teluguone.com/news/content/increase-inome-through-service-sector-39-199643.html





