చెరువుల పునరుజ్జీవనానికి హైడ్రా ముందడుగు..!
Publish Date:Aug 6, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా మరో కీలక అడుగు వేస్తోంది. పునరుద్ధరిస్తున్న చెరువుల్లోకి స్వచ్ఛమైన నీరు చేరేలా చర్యలు చేపడుతోంది. మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా అడ్డుకోవడంతో పాటు, వర్షాకాలంలో వరదనీరు చెరువుల్లోకి చేరేలా ఇన్‌లెట్ల అభివృద్ధి పనులు చేపడుతోంది. అలాగే తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసి చెరువులకు అందించే విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే బిట్స్ పిలానీ కేకే బిర్లా గోవా క్యాంపస్‌లో అభివృద్ధి చేసిన **'వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీ'**ని హైడ్రా పరిశీలించింది. స్థిరమైన మురుగునీటి నిర్వహణ, పట్టణ సరస్సుల పునరుద్ధరణ లక్ష్యంగా బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను పరిశీలించిన ఆయన, SBR, MBR టెక్నాలజీలతో పాటు వెట్‌ల్యాండ్ ట్రీట్‌మెంట్ వంటి ఆధునిక విధానాలపై నిపుణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా, ఈ సాంకేతిక పరిజ్ఞానాలతో క్షేత్రస్థాయిలో మురుగునీటిని ఎలా శుద్ధి చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తక్కువ విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం, దీర్ఘకాలిక సామర్థ్యం వంటి అంశాలను అధ్యయనం చేశారు. ప్రకృతి ఆధారిత నీటి శుద్ధి విధానమైన వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీ నీటి నాణ్యతను మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పునరుద్ధరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా సమర్థవంతంగా దోహదపడుతుందని బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ప్రొఫెసర్లు కమిషనర్‌కు వివరించారు. నగరంలోని చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాఫ్ట్స్ అధినేత యూనస్ కూడా కమిషనర్ వెంట ఉన్నారు. తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసి చెరువులకు అందించే ఈ విధానాన్ని హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని హైడ్రా నిర్ణయించింది. తొలి దశలో పాతబస్తీలోని బమ్రకున్-ఉద్-దౌలా చెరువులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని పనితీరును పరిశీలించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పర్యావరణహితమైన, తక్కువ విద్యుత్ వినియోగం మరియు నిర్వహణ వ్యయంతో కూడిన ఈ సాంకేతికతను వినియోగించడం ద్వారా నగరంలోని చెరువులకు శుద్ధి చేసిన నీటిని అందించడంతో పాటు, చెరువుల పునరుద్ధరణకు మరింత ఊతం లభిస్తుందని హైడ్రా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. HYDRA, BITS Pilani, KK Birla Goa Campus, SBR, MBR, Wetland Treatment, Sewage Treatment, Wastewater Management, Urban Lake Restoration
http://www.teluguone.com/news/content/hydra-36-228229.html





