ఈ విద్యార్ధులకేమైంది..!
Publish Date:Jul 3, 2016
Advertisement
మద్యం ..మనిషి నరనరాల్లోకి సైలెంట్‌గా ఎక్కి అది సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. రక్తం మరిగిపోయే వయసులో మద్యానికి బానిసలై యువత తమ జీవితాలు పాడు చేసుకోవడంతో పాటు ఎదుటివాడి జీవితాలు నాశనం చేస్తున్నారనడానికి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగిన ప్రమాదమే ప్రత్యక్ష నిదర్శనం. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని హిందూ శ్మశానవాటిక వద్ద గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మాదాపూర్‌లో నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పమ్మి రాజేశ్ తన అన్న కుమార్తెను తీసుకుని శాంత్రో కారులో బయలుదేరారు. కారులో వీరితో పాటు రాజేశ్ సోదరుడు రమేశ్, వదిన రాధిక, తండ్రి మధుసూదన్‌రావు కూడా ఉన్నారు. వీరంతా చిన్నారిని బోరబండలోని ఆమె ఇంట్లో విడిచిపెట్టేందుకు పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వైపు వస్తున్నారు. అదే సమయంలో ముఫకంజా కాలేజీ వైపు నుంచి వస్తున్న ఐ10 కారు శ్మశానవాటిక వద్ద అదుపుతప్పింది. పంజాగుట్ట వైపు వెళుతున్న ఆ కారు డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి రాజేశ్ కారుపై పడింది. అంతే అప్పటి వరకు నవ్వులు పూసిన ప్రయాణంలో హాహాకారాలు మిన్నంటాయి. జరిగిన ప్రమాదంలో కారు నడుపుతున్న రాజేశ్ అక్కడికక్కడే మరణించగా.. సోదరుడు బతికుండగానే జీవిచ్చవమైయ్యాడు. రాజేశ్ వదిన కాలు విరిగింది. ఇంటి పెద్దయిన తండ్రి వెన్నెపూస విరిగి మంచానికే పరిమితమయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి మృత్యుదేవతతో పోరాటం చేసి చివరికి ఓడిపోయింది. జరిగిన ప్రమాదానికి కారణం మద్యం..నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఆరుగురు విద్యార్ధులు, బంజారాహిల్స్ సినీమ్యాక్స్‌లో సినిమా చూసి, అనంతరం రెస్టారెంట్‌లో ఫుల్లుగా మద్యం సేవించి తమ కారులో ఇంటికి తిరిగి వెళుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయిన పవేల్ అనే విద్యార్థి తీరని విషాదానికి కారణమయ్యాడు. ఇదొక్కటే కాదు మద్యం మత్తులో విద్యార్ధులు ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. వీకెండ్స్‌లో తాగి తందనాలు ఆడుతూ నెక్లెస్‌రోడ్, ఔటర్‌రింగ్ రోడ్డులపై రేసింగ్‌లతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. నూనూగు మీసాలు కూడా రాని పిల్లలు 500 సిసి బైక్‌లతో విన్యాసాలు చేస్తున్నారు.. ఎన్ని బైక్ స్టంట్స్ చేస్తే.. అంత డబ్బు. అంత క్రేజ్. మద్యమే కాదు డ్రగ్స్ వాడకంలో విద్యార్ధులు ముందుంటున్నారు. డ్రగ్స్ మత్తులో యువత మునిగి తెలుతూ.. సాహసాలు చేస్తూ... డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. వరుస సంఘటనలతో అప్రమత్తమైన పోలీసులు పగటి పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని నిర్ణయించారు. రాత్రి కంటే పగలు మద్యం తాగడం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే రాత్రుళ్లతో పోలిస్తే పగలు రోడ్లపై జనసంచారం ఎక్కువ. మద్యం మత్తులో వాహనాలు నడిపి అదుపుతప్పితే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా..విద్యార్థులను దారిలో పెట్టాల్సింది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే. వీరి ప్రత్యక్ష నియంత్రణ ఉంటే తప్ప విద్యార్థుల ప్రవర్తనలో మార్పు రాదు. అదే మన ముందున్న సవాలు.
http://www.teluguone.com/news/content/hyderabad-students-45-63338.html





