హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జలమయమైన రోడ్లు..!
Publish Date:Jul 28, 2026
Advertisement
అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి..! హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. సాయంత్రం ఆఫీస్ వేళల్లో వర్షం దంచికొట్టడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుండపోత వర్షంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, బేగంపేట్, మణికొండ, కాచిగూడ ప్రాంతాల్లోనూ భారీ వర్షం ప్రభావం కనిపించింది. పలు చోట్ల ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న హైడ్రా, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు నీటి తొలగింపు, సహాయక చర్యలు చేపట్టాయి. వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ తన ఎక్స్ వేదిక ద్వారా సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరా యం ఏర్పడే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ముఖ్యంగా నీటితో నిండిన రహదారులు, నాలాలు, చెరువుల సమీప ప్రాంతాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షపు నీటి లోతు అంచనా వేయకుండా వాహనాలను నీటిలోకి తీసుకెళ్లడం ప్రమాదకరమని, వాహనదారులు వేగాన్ని నియంత్రిస్తూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించారు. భారీ వర్షాల పరిస్థితిని హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని, జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ తదితర ప్రభుత్వ విభా గాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నా మని కమిషనర్ వెల్లడిం చారు. ఎక్కడైనా రహదారులపై నీరు నిలిచినా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకు నేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, అత్య వసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100కు కాల్ చేయాలని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయం అందిస్తారని భరోసా ఇచ్చారు.ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని, భారీ వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉంటూ అధికారుల సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారిం చవచ్చని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Hyderabad Rains, Heavy Rainfall in Hyderabad, Hyderabad Rain Alert, GHMC, Monsoon Teams, IMD, Hydra, DRF, GHMC,
http://www.teluguone.com/news/content/hyderabad-rains-36-227400.html





