హిట్ లిస్ట్ లో పేరు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భద్రత పెంపు..
Publish Date:Aug 29, 2020
Advertisement
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలోని గోషామహల్ బీజేపీఎమ్మెల్యే రాజాసింగ్ కు డిసిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో భద్రత కల్పించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న కారణంగా ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఆయన పాత గన్ మెన్ స్థానంలో ఆధునిక ఆయుధాలకు కలిగిన కమెండోలను ఏర్పాటుచేశారు. పాత బస్తీలో ఉన్న రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భారీ స్థాయిలో భద్రతావలయాన్ని ఏర్పాటుచేశారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే రాజాసింగ్ ఇకపై స్వేచ్ఛగా బైక్ పై తిరగవద్దని ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు బయటకు వెళ్లాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గాలింపు చర్యల్లో దొరికిన కొంతమంది వద్ద మారణాయుధాలతో పాటు రాజాసింగ్ పేరు ఉన్న జాబితా కూడా దొరికిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇటీవల హైదరాబాదులో కొంతమంది స్లీపర్ సెల్స్ ను అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద కూడా రాజాసింగ్ పేరు లభించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నాయకుల పై ఉగ్రవాదులు దృష్టిసారించారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని గత కొద్దిరోజులుగా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు కూడా చెప్తున్నాయి. ఈనెల 15న భారత స్వాతంత్ర దినోత్సవం రోజు కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి అధికారిక వెబ్ సైట్ ను కూడా హ్యాక్ చేశారు. దీనిపై ఇప్పటికే కేసు ఫైలు చేసి విచారణ చేస్తున్నారు. గతిమాలిన ఉగ్రవాదులు బిజెపి నాయకులను హతమార్చిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు రాజాసింగ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 2013లో బిజెపి పార్టీలో చేరిన రాజాసింగ్ ఆ తర్వాత ఏడాది లోనే పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుపడి ప్రజల పక్షాన నిలబడ్డారు. దాంతో 2014లో వచ్చిన ఎన్నికల్లో గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ టికెట్ సాధించాడు. విజయం సాధించి పాతబస్తీలో పాగా వేసిన అభ్యర్థిగా గుర్తింపు పొందాడు. తిరిగి 2018 ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి కాషాయా జెండాను మరోసారి ఎగురవేశాడు. తాజాగా తన భద్రత పెంపుపై ఆయన స్పందిస్తూ తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో చెప్పాలని కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రికి, కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖలు రాస్తాను అంటున్నారు. ఉగ్రవాదుల నుంచా, స్థానిక సంస్థల నుంచా ఎవరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందో స్పష్టం చేయాలని ఆయన కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-police-increases-security-of-bjp-mla-raja-singh-39-103392.html





