ఆ ముగ్గురే హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ను అడ్డుకున్నది : సీఎం రేవంత్ రెడ్డి
Publish Date:Jun 15, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య సరికొత్త రాజకీయ యుద్ధానికి ఇది దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ లో అంకెలతో సహా కేంద్ర వైఖరిని ఖుల్లంఖుల్లా ఎండగట్టారు. గతంలో తుమ్మిడిహెట్టి బరాజ్ విషయంలో జరిగినట్లే, ఇప్పుడు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు విషయంలోనూ తాను కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేయడం, ఆ వెంటనే కిషన్ రెడ్డి వెళ్లి ఆ పనులకు పుల్లలు పెట్టడం నిత్యకృత్యంగా మారిందని రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ సబ్జెక్టుపై నేరుగా వివరణ ఇవ్వకుండా, నన్ను ఎవడూ టచ్ చేయలేడు అంటూ కిషన్ రెడ్డి అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రారంభం నుండి తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చారిత్రక కట్టడాల రక్షణ, అండర్ గ్రౌండ్ లైన్ల పేరుతో ప్రాజెక్టును మూడేళ్ల పాటు ఆలస్యం చేశారు. ఈ జాప్యం కారణంగా మొదట కేవలం 15,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన మెట్రో ప్రాజెక్టు వ్యయం ఏకంగా 22,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఆ తర్వాత కోవిడ్ ప్రభావం కూడా తోడవడంతో మెట్రో నిర్మాణ భాగస్వామి అయిన ఎల్ అండ్ టీ (L&T) సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఆపై పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం మెట్రో తదుపరి విస్తరణపై ఎలాంటి శ్రద్ధ పెట్టకపోవడం వల్ల, దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్ మెట్రో స్థానం క్రమంగా దిగజారి 9వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రో విస్తరణ కోసం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగింది. కేంద్ర నిబంధనల ప్రకారం మొదటి దశ యాజమాన్యమే రెండో దశను నిర్మించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుల భారాన్ని సైతం లెక్కచేయకుండా మొదటి దశను పూర్తిగా టేకోవర్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 30,000 కోట్ల రూపాయల విలువైన మెట్రోను కేవలం 15,000 కోట్ల రూపాయలకే కొనుగోలు చేసేలా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా, మెట్రో విస్తరణ కోసం ఐఆర్ఎఫ్ సీ (IRFC) ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణం అందేలా ఏర్పాట్లు జరిగాయి. జపాన్ అంతర్జాతీయ సంస్థ నుండి కేవలం 4 శాతం అత్యల్ప వడ్డీ రేటుతో 13,600 కోట్ల రూపాయల భారీ నిధులను రుణం రూపంలో తీసుకొచ్చారు. ఈ నిధులు ఐఆర్ఎఫ్ సీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉంది. అయితే, ఇక్కడే అసలు రాజకీయం మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మే 20వ తేదీన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను, మే 21వ తేదీన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కలిసి ఈ నిధులను తెలంగాణకు విడుదల చేయవద్దని, ప్రాజెక్టుకు అడ్డుపడాలని కోరినట్లు రేవంత్ రెడ్డి బాహాటంగా విమర్శించారు. అహ్మదాబాద్ మెట్రోకు, విశాఖపట్నం మెట్రోకు సులభంగా అనుమతులు ఇచ్చే కేంద్రం, హైదరాబాద్ మెట్రోకు మాత్రం ఎందుకు మోకాలడ్డుతోందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రానికి 50 శాతం భాగస్వామ్యం ఇవ్వడం ఇష్టం లేకపోతే, కనీసం ఎన్ఓసీ (NOC) ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించి మెట్రో విస్తరణ పనులు పూర్తి చేసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భాగస్వామ్య నిధులు ఇవ్వకుండా, కట్టే నిధులను అడ్డుకుంటూ కాళ్లల్లో కట్టెలు పెట్టడమేనా ప్రధాని మోదీ చెప్పిన సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు ఈ ఆరోపణలతో తీవ్ర డిఫెన్స్ లో పడ్డారు.
http://www.teluguone.com/news/content/hyderabad-metro-phase-2-36-222990.html





