10 రోజుల్లో 700 కి.మీ నడక.. వెంకటేష్ ను చూసి చలించిన సోనుసూద్
Publish Date:Jun 10, 2021
Advertisement
10 రోజులు.. 7 వందల కిలోమీటర్లు.. నడక.. కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే నడక.. అవును ఓ యువకుడు హైదరాబాద్ నుంచి ముంబై వరకు నడుచుకుంటూ వెళ్లాడు. తాను అభిమానిస్తున్న ఓ వ్యక్తిని కలుసుకోవడానికి ఈ సాహసం చూశాడు. మండు టెండలు, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా ఒంటరిగానే తన పయనం సాగించాడు. 10 రోజుల పాటు అలుపెరగకుండా నడిచి.. చివరికి తాను అనుకున్నది సాధించాడు. కొవిడ్ కల్లోల సమయంలో కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాంటూ సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచిన సోనుసూద్ ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్రగా వెళ్లిన వెంకటేష్.. 10 రోజుల నడక తర్వాత తన అభిమాన హీరోను కలిశాడు. తన కోసం 7 వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వెంకటేష్ ను అప్యాయంగా ఆహ్వానించారు సోనుసూద్. అభిమాని తో ఫోటో దిగి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చెప్పులు లేకుండా 700 కిలోమీటర్లు నడిచి వచ్చిన తన అభిమానిని చూసి చలించిపోయారు సోనూసూద్. దయచేసి ఎవ్వరూ ఇలాంటి పనులు చేయొద్దు అని కోరారు. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోను సూద్.. నిజజీవితంలో మాత్రం రియల్ హీరో. గత ఏడాది లాక్డౌన్ మొదలయినప్పటి నుంచి ఎంతో మందికి సాయం చేశారు. వలస కార్మికులను సొంత డబ్బులతో ఇంటికి పంపించారు. కష్టాల్లో ఉన్న పేదలకు కడుపు నింపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మందికి ఆక్సిజన్ పంపి ఊపిరి అందిస్తున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్‌తో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ అని ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి ఆదుకుంటున్నారు. అందుకే సోను సూద్‌కు దేశవ్యాప్తంగా జనాలు ఫిదా అయ్యారు. రియల్ హీరో అంటూ కీర్తిస్తున్నారు. ఆయన సాయం పొందినవారైతే దేవుడిగా కొలుస్తున్నారు. వికారాబాద్‌కు చెందిన వెంకటేష్ కూడా సోనును దైవంగా భావించాడు. తను దేవుడిని నేరుగా కలవాలని ఎవరూ చేయని సాహసం చేశాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాలపల్లికి చెందిన వెంకటేష్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడి తండ్రి ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో వెంకటేష్ హైదరాబాద్‌కు వెళ్లి ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఐతే లాక్డౌన్లో సోను సూద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చూసి... ఆయనకు అభిమానిగా మారిపోయాడు వెంకటేష్. రోజు రోజుకు అభిమానం పెరిగిపోయింది. సినిమా నటుడిలా కాకుండా ప్రత్యక్ష దైవంగా చూశాడు. ఈ క్రమంలోనే ఆయన్ను ఎలాగైనా కలవాలని అనుకున్నాడు. లాక్డౌన్ ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో.. కాలి నడకన ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 1న హైదరాబాద్ నుంచి ముంబైకి నడక ప్రారంభించాడు వెంకటేష్. 700 కిలోమీటర్లు నడిచాడు. వెంకటేష్ పాదయాత్ర గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సోనూసూద్.. అతడికి ఫోన్ చేశారు. నడుచుకుంటూ ముంబైకి రావొద్దు.. తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తానే కలుస్తానని చెప్పినట్లు వెంకటేశ్ చెప్పారు. సోనుసూదే ఫోన్ చేయడంతో వెంకటేష్ సంతోషాన్ని పట్టలేకపోయాడు. కానీ తన పాదయాత్రను ఆపలేదు. భక్తుల వద్దకు దేవుళ్లు రాకూడదు.. దేవుడి వద్దకే భక్తులు వెళ్లాలని వెంకటేష్ చెప్పాడు. సోనూసూద్‌ను కలవాలన్న మొండి పట్టుతో కాలి నడకన ముందుకు కొనసాగించాడు. చివరకు 10 రోజుల్లోనే తన అభిమాన హీరోను కలిశాడు.
http://www.teluguone.com/news/content/hyderabad-boy-meet-sonu-sood-after-700-km-walk-39-117374.html





