నేతల పర్యటనల పరమార్ధం ఏమిటో?
Publish Date:Feb 24, 2013
Advertisement
హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళు జరిగిననాటి నుండి నేటి వరకు కూడా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలందరూ మొదట సంఘటన స్థలానికి, అక్కడి నుండి నేరుగా క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు ఏదో తీర్ధయత్రలకి వచ్చినట్లు వరుసకట్టి మరీ వస్తున్నారు. ఈ రోజు ప్రదాని డా. మన్ మోహన్ సింగ్ కూడా వచ్చివెళ్ళడం జరిగింది. ఘటనా స్థలంలోకి ఎవరుపడితే వారు చొచ్చుకు రావడం వల్ల అత్యంత కీలకమయిన ఆధారాలన్నీ పోతున్నాయని దర్యాప్తు సంస్థలవారు బారికేడ్లు కట్టేంతవరకు కూడా, ముఖ్యమంత్రితో సహా మన నేతలందరూ కూడా అనాలోచితంగా లోనికి ప్రవేశిస్తూనే ఉన్నారు. ఇక, తీవ్ర గాయాలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారిని, ఈ విధంగా ఒకరి తరువాత మరొకరు చొప్పున రాజకీయనాయకులు వస్తూ పరామర్శించడం వల్ల రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్యులు ఎంత మొత్తుకొంటున్నా కూడా ఈ తీర్ధప్రజని ఎవరూ ఆపలేకపోతున్నారు. కారణం అందరూ వీఐపీలే. ఎవరిని కాదనలేని నిస్సహాయత వైద్యులది. ఈ రెండు సమస్యలకి తోడుగా వరుసకట్టి వస్తున్న నేతలందరికీ ప్రేలుళ్ళ గురించి, రోగుల పరిస్థితి గురించి మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి వివరించవలసి రావడంతో అటు సంబందిత అధికారులకి, రోగులకి, వైద్యులకి అందరికీ కూడా తల ప్రాణం తోక్కి వస్తోంది. ఇది సరిపోదనట్లు, వస్తున్న పెద్దలందరికీ భద్రత కల్పించడం, వారికి ప్రోటోకాల్ పాటించడం మరో పెద్ద ప్రహసనంగా మారింది. ఈ రోజు ప్రధాని రాక సందర్భంగా రాష్ట్ర రాజధానిలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణల కొరకు పోలీసు బలగాలు అన్ని అంకితమయిపోయాయి. దర్యాప్తు సంస్థలకు అత్యంత కీలకమయిన ఈ సమయంలో, ఇటువంటి వీవీఐపిల ఆగమనం కొత్త ఇబ్బందులు సృష్టిస్థాయి. దర్యాప్తుపై దృష్టి కేంద్రీకరించవలసిన ఈ సమయంలో, రాజకీయ నాయకులకు భద్రత కల్పించడానికి, వారికి సకల మర్యాదలతో రెండు ప్రాంతాలకు పర్యటింపజేసి సాగనంపడానికి వారి సమయం సరిపోతోంది. ఈ ఇబ్బందుల గురించి సంబందిత అధికారులెవరూ దైర్యంగా చెప్పే అవకాశం లేదుగనుక, రాజకీయనేతలే వారి సమస్యని అర్ధం చేసుకొని వారిని దర్యాప్తు, వైద్యులని చికిత్స చేసుకోనివ్వడం సముచితం. అసలు ఈ దుర్ఘటన పట్ల బాధపడుతూ వచ్చిన వారికంటే, రాజకీయంగా తప్పని సరి పరిస్థితులవల్లనే ఈ తీర్ధప్రజ పెరిగిందని చెప్పవచ్చును. అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షాల విమర్శలకు గురికావలసి వస్తుందని పర్యటిస్తుంటే, ఇంత పెద్దదుర్ఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించకపోతే రాజకీయంగా సమస్యలోస్తాయనే భయంతో ప్రతిపక్షాలు క్యూలు కడుతున్నాయి. అధికార పార్టీ నేతలు తమది నైతిక బాధ్యత అని భావిస్తే, ప్రతిపక్షాలు ప్రజలకు సానుభూతి చూపడం తమ బాధ్యత అంటూ పర్యటిస్తున్నాయి. అందరి ఉద్దేశ్యం కూడా ప్రజల దృష్టిలో తాము అత్యంత బాధ్యతాయుతమయిన రాజకీయనాయకులుగా ప్రదర్శించుకొందామనే ఆరాటమే తప్ప, తమ పర్యటనలవల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని వారికీ తెలుసు. ఇంత ఘోర దుర్ఘటన జరిగినప్పుడు కూడా అధికార ప్రతిపక్షాలలో ఐక్యంగా స్పందించాలనే ఆలోచన కలుగలేదు, ప్రతిపక్షాలను చూసి అధికార పార్టీ పర్యటిస్తే, అధికార పార్టీని ఇరుకున బెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రతిపక్షాలు పర్యటిస్తున్నాయి. ఒకరి మీదమరొకరు మాటల తూటాలు పేల్చుకోవడమే తప్ప, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కలిసి కూర్చొని ఒక పరిష్కారం కనిపెడదామనే ఉద్దేశ్యం అంతకన్నాలేదు. ప్రజలలో చైతన్యం రావాలని పిలుపునిచ్చే మన రాజకీయ నాయకులు, ముందు తాము చైతన్యం అయితే బాగుంటుంది.
http://www.teluguone.com/news/content/hyderabad-bomb-blasts-37-21186.html





