హైదరాబాద్‌లో రికార్డు స్ధాయి వర్షం..జనజీవనం అస్తవ్యస్తం
Publish Date:Aug 7, 2025
Advertisement
హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టుప్రాంతాల్లో వరదనీళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిల్ మాల్, రాయదుర్గం, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ముందుకు కదలడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. మియాపూర్, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ కారణంగా నానా తిప్పలు పడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్ పేట్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. బంజారాహిల్స్ లో భారీ వర్షం కురవడంతో దేవరకొండబస్తీ లో సంతలో కూరగాయలు, వాహనాలు కొట్టుకుపోయాయి. మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా కొండాపూర్, హైటెక్స్, కొత్తగూడ నుంచి కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్ కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. సైబర్టవర్స్ నుంచి నీరూస్ జంక్షన్ వరకు నీళ్లు నిలిచిపోవడంతో ఈ రూట్లో వెళ్లే వెహికల్స్కు రోడ్డు బ్లాక్ అయింది. ఇనార్బిట్ మాల్నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్‌తో ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్, గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్ వైపు వెళ్లే వాటితో ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర అయితే ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం.. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, జలమండలి (హైడ్రా) అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇళ్లలోకి నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌లోని ఈ ఫోన్ నెంబర్ 040 2302813 / 7416687878 కి కాల్ చేయాలన్న ప్రజలకు జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. అలాగే అధికారులందరూ అందుబాటులో ఉంటూ.. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే రెవిన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వర్షాలు, వరదల వల్ల ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే, వాటిని ఎదుర్కొనేందుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన గట్టిగా సూచించారు. గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద అత్యధిక వర్షపాతం నమోదైంది. 123.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీలో 111.3 మి.మీ, ఖైరతాబాద్‌లోని సెస్ వద్ద 108.5 మి.మీ, యూసఫ్‌గూడ జోనల్ కమిషనర్ కార్యాలయం సమీపంలో 104.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/hyderabad-39-203746.html





