గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై హాట్ హాట్ చర్చలు!
Publish Date:Aug 13, 2025
Advertisement
గత ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్ కుటుంబం మళ్ళీ తెలుగుదేశంలోకి రీఎంట్రీ పై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. పాతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి ఏపి రాజకీయాలలో ఉద్దండుడు. రెండు సార్లు చిత్తూరు ఎంపీగా గెలిచారు. చంద్రబాబు నాయుడికి సైతం మొదట్లో రాజకీయంగా ఎదగడానికి సాయపడ్డారంటారు. అలాంటి రాజగోపాల్ నాయుడి వారసురాలిగా అయన ఎకైక కూమార్తె గల్లా అరుణ 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గల్లా అరుణ టిడిపి తరపున పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పట్లో పార్టీ మారి వచ్చిన ఆమెను తెలుగుదేశం వారే ఓడించారనే ప్రచారం జరిగింది. తర్వాత తెలుగుదేశం రాష్ట ఉపాధ్యక్షురాలిగా , పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసినప్పటికీ ఎన్నికల్లో పోటీకి గల్లా అరుణ దూరంగా ఉండిపోయారు. అయితే ఆ కుటుంబానికి చెందిన అమె కూమారుడు గల్లా జయదేవ్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గానే కాకుండా సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా కూడా తనను తాను నిరూపించుకున్నారు . 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు మార్లు గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో మోడీ ని సూటిగా ప్రశ్నించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు గల్లా జయదేవ్. వైసీపీ తోనూ ఢీ అంటే ఢీ అనే లా జయదేవ్ పోరాడారు. అంత వరకు బాగానే ఉన్నా.. వైసీపీ హయాం సాగిన ఐదేళ్లూ గల్లా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లుతోందని అమర రాజా సంస్థపై వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. పొల్యూషన్ బోర్డు అధికారులు రంగంలోకి దిగి అమరరాజా సంస్థకు వరుస నోటీసులు ఇచ్చారు. ఈ సంస్థ వెదజల్లుతున్న కాలుష్యం ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని నీరు కలుషితం అవుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరోపణ. చివరకు ఈ వ్యవహారం కాస్తా అమర్ రాజా సంస్థకు క్లోజర్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళింది. దీంతో అమరరాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా తవణం పల్లి మండలం దిగువ మాఘం గల్లా కుటుంబం స్వగ్రామం. గల్లా కుటుంబంపై జగన్ హయాంలో అక్కడ భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. తమ భూములు ఆక్రమించారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి తదితరులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది. గుంటూరులో కూడా ఎంపి జయదేవ్ ఉహించని విధంగా వైసీపీ కార్యకర్తలు, పోలీసుల దాడులతో జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని అంటున్నారు. మిస్టర్ ప్రై మినిస్టర్ అనేంత ధైర్యం ఉన్న జయదేవ్ జగన్ ప్రభుత్వ కక్షసాధింపులతో విసిగిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికలలో పోటికి సైతం దూరంగా ఉన్నారు. అయితే గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో పాటు గుంటూరు నుండి గెలిచిన పెమ్మసాని ఎకంగా కేంద్ర మంత్రి అవ్వడంతో గల్లా జయదేవ్ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారనే భావనలో గల్లా శ్రేయోబిలాషులు ఉన్నారంట. ఇదే విషయాన్నిసన్నిహితుల వద్ద గల్లా కూడా పలు మార్లు చెప్పుకొచ్చినట్లు సమాచారం. మరో ఏడాదిలో రాజ్యసభ స్థానాల భర్తీ ఉండటంతో ఇదే సరైన సమయంగా భావించిన గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై తన కోరికను బయటపెట్టారనే ప్రచారం సాగుతోంది. గల్లా కుటుంబం రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతామంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాదనే పరిస్థితి లేదంటున్నారు. ఆ క్రమంలోనే తాజాగా కాణిపాకంలో దేవుడి అనుగ్రహం, నా అవసరం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా, పార్టీ పెద్దలతో చర్చిస్తున్నానంటూ గల్లా జయదేవ్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జయదేవ్ వ్యాఖ్యలు తెలుగుదేశంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే రాజ్యసభ కు ఇప్పటికే పోటి ఎక్కవగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో పరిచయాలు ఉన్న జయదేవ్ వస్తే పార్టీకి మరింత మేలే జరుగుతుంది అనే భావన కొందరు పార్టీ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. అయితే జయదేవ్ ను వ్యతిరేకించే వాళ్ళు కూడా పార్టీలో లేకపోలేదు. పార్టీ కష్ట సమయాల్లో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో దూరంగా ఉండడం పై గల్లా కుటుంబంపై కొద్ది మంది నేతలు విమర్శలు చేస్తున్నారు. అప్పుడు వ్యాపార అవసరాల కోసం పూర్తి స్థాయిలో సైలెంటై, ఇప్పుడు అధికారంలో ఉన్నామని తిరిగి ఎంట్రీ ఇవ్వాలనుకోవడంపై పార్టీ సీనియర్లు మండిపడుతున్నారంట.
http://www.teluguone.com/news/content/hot-debate-on-galla-jayadev-political-re-entry-39-204136.html





