కర్ణాటక నుంచి హైదరాబాద్ పాకిన హిజాబ్ వివాదం
Publish Date:Jun 17, 2023
Advertisement
కర్ణాటకలో నిరుడు ప్రారంభమైన హిజాబ్ వివాదం తెలంగాణకు పాకింది. హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం తలెత్తింది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరైన కొందరు ముస్లిం విద్యార్థినులు తమను హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించలేదని ఆరోపించారు. హిజాబ్‌తో పరీక్ష కేంద్రంలోకి రావద్దని సిబ్బంది తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు, కాలేజీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా తెలిసింది. చివరకు కొందరు హిజాబ్ తీసేసి పరీక్షకు హాజరైనప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మిగతా వారిని హిజాబ్‌తోనే పరీక్షకు అనుమతించినట్టు సమాచారం. ఈ వివాదం కారణంగా తాము అరగంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభించామని విద్యార్థినులు చెప్పారు. తదుపరి పరీక్షకు హిజాబ్ లేకుండా రావాలని కూడా సిబ్బంది ఆదేశించారని అన్నారు. మరోవైపు, ఈ వార్తలను కాలేజీ యాజమాన్యం ఖండించింది. హిజాబ్ ధరించిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడతామని కూడా విద్యార్థినుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 2022 ప్రారంభంలో, మన దేశంలోని కర్నాటక రాష్ట్రంలో తొలిసారి హిజాబ్ ఉల్లంఘన నిబంధన వచ్చింది. పాఠశాల యూనిఫామ్‌లకు సంబంధించిన వివాదం అట్టుడికింది. తరువాతి వారాల్లో, ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పాఠశాలలు, కళాశాలలకు వ్యాపించింది, కాషాయ కండువాలు ధరించాలని డిమాండ్ చేస్తూ హిందూ విద్యార్థులు రెచ్చిపోయారు. అనేక విద్యాసంస్థలు హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. కర్ణాటకలో సద్దుమణిగిన ఈ వివాదం మరో పొరుగునే ఉన్న తెలంగాణకు పాకింది.
http://www.teluguone.com/news/content/hijab-rule-in-hyderabad-39-156962.html





