తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి టూర్‌కి అనుమతి నిరాకరణ
Publish Date:Jul 15, 2025

Advertisement
తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సొంత ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం ఇప్పట్లో లేనట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు తాడిపత్రి బయలుదేరినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది. ఆయన తాడిపత్రి ఎంట్రీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు . తాజాగా మంగళవారం (జులై 15)న మరో సారి పోలీసులు ఆయన తాడిపత్రిలో తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. దీంతో తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పెద్దారెడ్డి పోలీసులను కోరారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సైతం ఆ జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు. కాగా గతంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన సందర్భంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావడంతో పోలీసులు ఆయన్ను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.
ఈ సారి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రికి రావొద్దని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి నోటీసులు అందించారు. తాడిపత్రిలో మంగళవారం (జులై 15)మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో వైసీపీ నేతలు తమ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక పెద్దారెడ్డి వెనక్కి తగ్గారు. ఈ నెల 18న ఈ కార్యక్రమాన్ని జరుపుతామని పెద్దారెడ్డి తెలిపారు.
తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వారిద్దరి మధ్య వైరం ఉన్న సంగతి తెలిందే. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారు అన్న సమాచారాన్ని విహార యాత్రలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అక్కడి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన హుటాహుటిన ప్రత్యేక విమానంలో విహారయాత్ర నుంచి తాడిపత్రి బయలుదేరినట్లు సమాచారం. ఒకవేళ పెద్దారెడ్డి తన తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోకపోయుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకునేవి అంటున్నారు.
http://www.teluguone.com/news/content/high-tenssion-in-tadipatri-again-39-202027.html












