మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇప్పించాలి.. తల నరికేస్తే ఏం లాభం? హైకోర్టు షాకింగ్ కామెంట్స్..
Publish Date:Jun 2, 2021
Advertisement
కరోనా విషయంలో అన్నిటికంటే సమర్థవంతంగా పని చేస్తున్నది కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను హెచ్చరిస్తూ.. తప్పులు సవరిస్తూ.. అధికారులకు మొట్టికాయలు వేస్తూ.. కరోనా కట్టడికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో కరోనా చికిత్స పేరుతో కాసుల వ్యాపారం చేస్తున్న హాస్పిటల్స్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలంటూ సర్కారును ఆదేశించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేయడంపై హైకోర్టు సంచలన కామెంట్లు చేసింది. ‘‘మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇప్పించాలి కానీ.. తల నరికేస్తే ఏం లాభం?.. లైసెన్స్‌లు రద్దు చేశాక ఆసుపత్రులు బాధితులకు సొమ్ము తిరిగి ఇవ్వకుండా మొండికేస్తాయి కదా!’’ అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ చర్యలపై హైకోర్టులో విచారణ సందర్భంగా.. ప్రైవేటు ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయని, 21 ఆసుపత్రులకు కొవిడ్ చికిత్సల లైసెన్స్‌లు రద్దు చేశామని తెలంగాణ డీహెచ్ హైకోర్టుకు వెల్లడించారు. ఆసుపత్రుల కొవిడ్ చికిత్సల లైసెన్స్ రద్దు చేస్తే సరిపోతుందా? ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఛార్జీలు బాధితులకు తిరిగి చెల్లించాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. లైసెన్స్‌ల రద్దు కన్నా బాధితులు చెల్లించిన అధిక ఛార్జీలు తిరిగి ఇప్పించడం ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికంగా వసూలు చేసిన ఛార్జీలు తిరిగి ఇవ్వకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించాలని హైకోర్టు అభిప్రాయపడింది. బాధితులకు ఛార్జీలు తిరిగి ఇప్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీహెచ్ వివరణ ఇచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలు ఖరారు చేశారా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మొదటి దశలోనే గరిష్ఠ ధరలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చామని డీహెచ్ తెలపగా.. రెండో దశలో ఎందుకు సవరించలేదని హైకోర్టు ప్రశ్నించింది. గరిష్ఠ ధరలు మరోసారి సవరిస్తామని డీహెచ్ వివరణ ఇవ్వగా.. గరిష్ఠ ధరలు ఖరారు చేసి వెబ్సైట్లో పెట్టి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మూడోదశ కరోనా ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని హైకోర్టు తెలంగాణ డీహెచ్‌ను ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని పడకలు ఆక్సిజన్ పడకలుగా మారుస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాం. సొంతంగా ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు చెప్పాం. ఈనెల 10 నాటికి 14 కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి’’ అని డీహెచ్ హైకోర్టుకు వివరించారు.
http://www.teluguone.com/news/content/high-court-shocking-comments-on-high-fee-in-private-hospitals-39-116799.html





