మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు
Publish Date:Feb 17, 2026
Advertisement
నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థుల కిడ్నాప్ కేసులో నటుడు, మోహన్ బాబు వర్సిటీ చాన్సలర్ మోహన్ బాబు తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్టు సహా తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం డిస్మిస్ చేసింది. కిడ్నాప్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్‌లో మాట్లాడారని, మెసేజ్‌లు పంపారనీ పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఫోరెన్సిక్ నివేదిక రానున్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేశారు. కేసులో లోతైన విచారణ జరపాల్సి ఉందని పేర్కొంటూ, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని మోహన్‌బాబు దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై తిరుచానూరు పోలీసులు ఈ నెల 3న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలిసిందే. ఈ కేసులో మోహన్‌బాబును ఏ-2గా పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/high-court-dismiss-mohanbabu-petition-36-214262.html





