అదానీపై హిండెన్ బర్గ్ మరో బాంబు!
Publish Date:Sep 13, 2024
Advertisement
అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక మోడీ అండదండలు, ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో అదానీ అదానీ లక్ష్యంగా అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ చేస్తున్న ఆరోపణలు, వెలువరిస్తున్న నివేదికలు మాత్రం ఆయన వ్యవహార శైలీ, వ్యాపార విస్తరణల వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలకు తావిస్తునే ఉన్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న అదానీపై హిండెన్ బర్గ్ తాజాగా మరో బంబు పేల్చింది. అదానీ మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడ్డారని హిండెన్ బర్గ్ పేర్కొంది. ఈ విషయం స్విస్ అధికారుల విచారణలో తేలిందని కూడా హిడెన్ బర్గ్ ప్రకటించింది. అందుకే తమ దేశంలో ఉన్న అదానీ గ్రూప్‌కు చెందిన అనేక బ్యాంక్ అక్కౌంట్లను స్విట్జర్లాండ్ సీజ్ చేసిందని పేర్కొంది. ఇలా పలు స్విస్ బ్యాంక్ అకౌంట్లలలో జమ చేసిన 310 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 2600 కోట్ల రూపాయల పైనే సీజ్ అయ్యాయని హిండెన్ బర్గ్ పేర్కొంది. స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్న హిండెన్ బర్గ్ బ్రిటన్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో వివాదాస్పద నిధులలో అదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంది. ఈ వార్త కూడా చదవండి.. అదానీ మహా పతనం వెనుక కుట్ర? అయితే సహజంగానే హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. స్విస్ కోర్టు ప్రొసీడింగ్స్ తో ఎలాంటి సంబంధం లేదన్న అదానీ గ్రూప్, ఆ దేశంలోని తమ బ్యాంక్ అక్కౌంట్లేవీ సీజ్ కాలేదని వివరణ ఇచ్చింది. తమ గ్రూప్ మార్కెట్ విలువను పతనం చేయడానికీ, ప్రతిష్టను దెబ్బతీయడానికి హిండెన్ బర్గ్ ప్రయత్నిస్తున్నదని విమర్శించింది. మోడీ ప్రధానిగా తొలి సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచే అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించడం ఆరంభమైందన్నది మాత్రం వాస్తవం. అయితే గత ఏడాది అదానీ ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, కృత్రిమంగా షేర్ విలువలు పెంచడం, అవినీతి, మనీ లాండరింగ్ తదితర ఆరోపణలు గుప్పిస్తూ హిండెన్ బర్గ్ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ ప్రభావంతో అప్పటి వరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ ఆ తరువాత నెల రోజుల వ్యవధిలోనే 26వ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అదానీ గ్రూపు షేర్ల విలువ సగానికి పైగా పతనమైంది. సరే ఆ తరువాత ఎలాగోలా కోలుకుందనుకోండి. అది వేరే సంగతి అప్పట్లో.. అయినా అదానీ గ్రూపు సంస్థలపై మదుపర్ల విశ్వసనీయత సన్నగిల్లిందన్నది వాస్తవం. అప్పట్లో అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ నివేదిక వెనుక ఉన్నది మరో పారిశ్రామిక దిగ్గజం, విప్రో వ్యవ స్థాపకుడు అయిన ప్రేమ్ జీ అన్న ప్రచారం జరిగినా కూడా మదుపర్లలో అదానీ గ్రూపుపై నమ్మకం కలగలేదు. ఇప్పుడు తాజాగా అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డులను ఉటంకిస్తూ చేసిన ఆరోపణలు మార్కెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరో గ్రేట్ ఫాల్ ను అదానీ గ్రూపు సంస్థలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/hidenburg-fresh-alligations-on-adani-39-184751.html





