తాడిపత్రిలో హైటెన్షన్ ఇరకాటంలో పోలీసులు
Publish Date:Aug 18, 2025
Advertisement
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 14 నెలల తరువాత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టనుండటమే ఇందుకు కారణం. నియోజకర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానంటూ పెద్దారెడ్డి తాడిపత్రి రానున్నారు. ఆయన తాడిపత్రి ప్రవేశానికి కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. తాము విధించిన షరతులకు లోబడే తాడిపత్రి పర్యటన ఉండాలన్న షరతు విధించింది. దీంతో సోమవారం (ఆగస్టు18) తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు పెద్దారెడ్డి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేత జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారన్న భావనతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద పెద్దారెడ్డి ఎంట్రీ నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి గత కాలంగా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రి లోకి ప్రవేశించేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కోర్టు కూడా పెద్దారెడ్డికి భద్రత కల్పించి తాడిపత్రిలోకి అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పెద్దారెడ్డి సోమవారం (ఆగస్టు 18) తాడిపత్రి బయలుదేరారు. అయితే ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరుకావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెచ్చరిల్లి ఘర్షణకు దారి తీసు ప్రమాదం ఉందన్న భావనతో తాడిపత్రికి బయలుదేరిన పెద్దిరెడ్డిని పోలీసులు మార్గమధ్యంలో నే అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తాడిపత్రికి రావద్దంటూ పెద్దిరెడ్డికి చెబుతు న్నారు. కోర్టు అనుమతితో వస్తున్న తననెలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి పోలీసులను నిలదీస్తున్నారు. మొత్తం మీద తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం పోలీసులను ఇరకాటంలో పడేసింది.
http://www.teluguone.com/news/content/hi-tenssion-in-tadipatri-39-204427.html





