సీఎం వస్తున్నారహో.. ఏపీలో కొత్త రాచరికం!
Publish Date:May 24, 2023
Advertisement
రాజులు పోయారు.. రాచరికపు వ్యవస్థ పోయింది. కానీ ఏపీలో మాత్రం కొత్త రాచరిక వ్యవస్థ దివ్యంగా అలరారుతోంది. ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు నాటి ఆడంబరాలను గుర్తుకు తేవడమే కాదు.. రాచరికపు దర్పాన్నీ, సామాన్యులను ఇక్కట్ల పాలు చేసే అహంకారాన్నీ ప్రతి బింబిస్తున్నాయి. కొన్ని గంటల సీఎం పర్యటన కోసం ఏళ్ల నాటి చెట్లను నరికేస్తున్నారు. ఆయన పర్యటన మార్గంలో ట్రాఫిక్ ను స్తంభింప చేస్తున్నారు. దుకాణాలను మూసేస్తున్నారు. ఆంక్షల పేరుతో గంటల తరబడి సామాన్యులకు నరకం చూపిస్తున్నారు. అందుకే సీఎం పర్యటన అంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఏపీ సీఎం గుంటూరులో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా విధించిన ఆంక్షలు సామాన్యులకు చుక్కలు చూపాయి. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ మాతృమూర్తి మరణించడంతో ఆయన్ను పరామర్శించేందుకు సీఎం బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు గుంటూరు వాసులను నానా ఇబ్బందులకూ గురి చేశాయి. పోలీసు కవాతు మైదానం, కలెక్టరేట్ కూడలి, కంకరగుంట బ్రిడ్జి, నగరంపాలెం కూడలి, పట్టాభిపురం, శ్యామలానగర్ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో బారికేడ్లను పెట్టారు. సీఎం ఉదయం 8 గంటలకు గుంటూరు వస్తారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. సుమారు 9.30 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ పోలీసు కవాతు మైదానాన్ని చేరుకుంది. అక్కడినుంచి సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ను నిలిపేశారు. ముఖ్యమంత్రి తన పర్యటన ముగించుకొని తిరిగి పోలీసు కవాతు మైదానానికి సుమారు పదిన్నరకు చేరుకున్నారు. ఈ పర్యటన కోసం దాదాపు 4 గంటలపాటు నగరవాసులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులు క్షణమో యుగంలా గడిపారు. ఆయా మార్గాలను ఉన్నపళంగా మళ్లించడంతో స్థానికులు అష్టకష్టాల పాలయ్యారు. ఇక కొవ్వురులో కూడా ఇదే తంతు. కొవ్వురులో సీఎం పర్యటన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేజీఎం పాఠశాల సమీపంలో హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి రెండు కి.మీ. పరిధిలో పలుచోట్ల చెట్ల కొమ్మలు తొలగించారు.
http://www.teluguone.com/news/content/hell-to-common-man-with-restrictions-25-155830.html





