కవలలను బలి తీసుకున్న జిల్లాల విభజన!
Publish Date:May 22, 2021
Advertisement
తెలంగాణలో జిల్లాల విభజన జరిగి మూడేండ్లు కావస్తున్నా పాలన మాత్రం కొలిక్కి రావడం లేదు. జిల్లాల విభజనతో వచ్చిన సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల విభజన తెచ్చి తంటాతో కరీంనగర్ లో దారుణం జరిగింది. కవల పిల్లలు చనిపోవడానికి కారణమైంది. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట తల్లికి గర్భశోకం కలిగింది. కవలల్లో మూడు రోజుల క్రితం పురుటిలోనే కన్నుమూసింది ఓ బిడ్డ. మృత్యువుతో పోరాడి మరో మగ శిశువు శనివారం చనిపోయింది. బెజ్జంకి మండలం గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. జిల్లాల విభజన తర్వాత సిద్దిపేట జిల్లాలోకి వచ్చింది. బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన గర్బిణి.. ప్రసవం కోసం గత సోమవారం కరీంనగర్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి వెళ్లింది. అయితే వేరే జిల్లా వాళ్లకు ఇక్కడ చూడమని చెప్పి సిద్ధిపేట జిల్లాకు వెళ్లాలని అక్కడి డాక్టర్లు తిప్పి పంపారని బంధువుల ఆరోపణ. అక్కడి నుంచి సిద్ధిపేటకు వెళ్తే గజ్వేల్ వెళ్లాలని చెప్పారట. గజ్వేల్ వెళ్తే హైదరాబాద్ వెళ్లాలని అక్కడి వైద్యుల సూచించారట.ఎక్కడికి వెళ్లినా ఎవరూ చేర్చుకోకపోవడంతో బాధిత గర్భిణి తిరిగి కరీంనగర్ వచ్చేసింది. కరీంనగర్ డాక్టర్లను ప్రాదేయపడటంతో మూడు రోజుల క్రితం ఆమెకు అడ్మిషన్ ఇచ్చారు. అయితే అప్పటికే తల్లి గర్భంలో ఉన్న కవలల్లో ఆడశిశువు కడుపులోనే మృతి చెందింది. శనివారం మగశిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. తమ జిల్లా పరిధి కాదంటూ ప్రసవం కోసం వచ్చిన మహిళ తిప్పి పంపించడం దుమారం రేపుతోంది. గర్భిణిని చేర్చుకోకుండా తిప్పిన కరీంనగర్, గజ్వేల్, సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కవలల మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/health-officials-neglect-twins-died-in-karimnagar-dist-39-116018.html





