ఎస్సీగా నిరూపించుకోండి... వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి సమన్లు...
Publish Date:Nov 20, 2019

Advertisement
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... కుల వివాదంపై విచారణ మొదలైంది. తనను కులం పేరుతో దూషించారంటూ ఉండవల్లి శ్రీదేవి ఫిర్యాదు చేయడంతో తుళ్లూరు పోలీసులు పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే, ఉండవల్లి శ్రీదేవి అసలు ఎస్సీనే కాదని, ఆమె క్రిస్టియన్ అంటూ నిందితులు, అలాగే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం... జాతీయ మానవ హక్కుల కమిషన్ అండ్ జాతీయ ఎస్సీ కమిషన్ తోపాటు రాష్ట్రపతిని ఆశ్రయించారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందిన శ్రీదేవి ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దాంతో, ఉండవల్లి శ్రీదేవి... హిందువో... క్రిస్టియనో... తేల్చాలంటూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి ఆదేశాలు వచ్చాయి. అయితే, ఉండవల్లి శ్రీదేవి... క్రిస్టియన్ కాదు... హిందువు అంటూ రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని, దానికి ఎల్వీ ఒప్పుకోకపోవడంతో... ఆకస్మిక బదిలీ చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్ కు కూడా ఆదేశాలు వెళ్లడంతో... ఈసీ ఆర్డర్స్ మేరకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్... తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సమన్లు పంపారు. నవంబరు 26న మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించారు. ఎస్సీగా నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు, ఆధారాలతో రావాలని, కావాలంటే బంధువులను కూడా వెంట తెచ్చుకోవచ్చని సూచించారు.
అమెండ్-మెంట్ 1950 పేరా 3 ప్రకారం దళితులు మతం మార్చుకుంటే ఎస్సీ హోదాను, రిజర్వేషన్ హక్కులను కోల్పోతారని... ఉండవల్లి శ్రీదేవి తాను క్రిస్టియన్ అని చెప్పుకున్నందున ఆమె ఎన్నిక చెల్లదని లీగల్ రైట్స్ ప్రోటెక్షన్ ఫోర్స్ అంటోంది. అయితే, ఈ దళిత క్రిస్టియన్ వివాదం ఎప్పట్నుంచో ఉంది. ఎస్సీలు... క్రైస్తవ్యంలోకి వెళ్తే... రిజర్వేషన్లను కోల్పోతారని, వాళ్లు బీసీ-సీగా పరిగణించబడతారని రాజ్యాంగం చెబుతోంది. అయితే, పుట్టిన కులం ఎలా మారుతుందని... కులం వేరు... మతం వేరంటూ పలు సందర్భాల్లో కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే, ఎవరైతే క్రైస్తవ్యంలోకి వెళ్తారో... వాళ్లు స్వచ్ఛందంగా బీసీ-సీ సర్టిఫికెట్ తీసుకుంటే తప్ప... ఎస్సీ హోదా పోయే అవకాశమే లేదు. ఒకవేళ బీసీ-సీలోకి వెళ్లినా... ఆ వ్యక్తి యొక్క సామాజిక గుర్తింపు అంటే సమాజపరంగా అతని కులం... ఇతరులు గుర్తించే విధానం కూడా మారే అవకాశం లేదు. క్రైస్తవ్యాన్ని స్వీకరించినా, హిందుత్వంలో ఉన్నా... ఏ కులంలో అయితే పుట్టాడో... ఆ కులంతోనే ఆ వ్యక్తిని సమాజం గుర్తిస్తుంది... పిలుస్తుంది. మరి అలాంటప్పుడు కులం ఎలా మారుతుందనే ప్రశ్న వస్తోంది.
అయితే, ఇఫ్పుడు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... హిందువా? లేక క్రిస్టియనా? తేల్చాలంటూ ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం... అలాగే ఎన్నికల కమిషన్ నుంచే ఆదేశాలు రావడంతో.... తేనెతుట్టెను కదిపినట్లయ్యింది. అయితే, టెక్నికల్ గా ఉండవల్లి శ్రీదేవి బీసీ-సీలోకి మారనంతవరకు ఆమె ఎస్సీగానే పరిగణించబడుతుంది. చర్చికి వెళ్తుంది కాబట్టి ఆమె ఎస్సీ కాదని తేల్చడం అంత ఈజీ పని కాదు. అందుకు ఎన్నో అడ్డంకులు వస్తాయి. కేవలం శ్రీదేవి మాటలను పరిగణనలోకి తీసుకుని ఆమె ఎస్సీ హిందువు కాదు... క్రిస్టియన్ అని తేల్చితే మాత్రం... అది శ్రీదేవి ఒక్కరితో పోదు... దాదాపు ఎస్సీ ప్రజాప్రతినిధులందరి మెడకు చుట్టుకుంటుంది. ఎందుకంటే ఎస్సీ ప్రజాప్రతినిధుల్లో అధికశాతం క్రైస్తవ్యాన్ని అనుసరించేవాళ్లు ఉన్నారనేది కాదనలేని నిజం. ఒకవేళ ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదని జేసీ నివేదిక ఇస్తే మాత్రం ఎమ్మెల్యే పదవి కోల్పోవడం ఖాయం. అదే సమయంలో ఇతర ఎస్సీ ప్రజాప్రతినిధులపైనా ఇలాంటి కేసులు, ఫిర్యాదులు రానున్నాయి. ఎందుకంటే అట్రాసిటీ కేసులు, మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న హిందూ సంస్థలు, కొన్ని వర్గాలు.... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధుల క్రైస్తవ మూలాలపై ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి, ఉండవల్లి శ్రీదేవి కుల వివాదం ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/guntur-district-joint-collector-sends-notice-to-ycp-mla-sridevi-on-caste-issue-39-91381.html












