యలమంచలి వైసీపీలో గుడివాడ వివాదం
Publish Date:Jul 12, 2025
Advertisement
వైసీపీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఇదంతా తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అన్న అనుమానం కలగక మానదు. వైసీపీకి ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలవా అన్నట్లు ఆ పార్టీ నేతలు అంతర్గత విభేదాలను రచ్చకీడ్చి కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీ నియామకం వైసీపీలో రచ్చకు కారణమౌతోంది. కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీ హైకమాండ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. చాలా కాలంగా వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో తనకు బదులు తన కుమారుడు సుకుమార వర్మ కు ఎలమంచిలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్మోహన్రెడ్డిని కోరారు కానీ.. ఆయన నిరాకరించడంతో కన్నబాబు రాజు స్వయంగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ వ్యతిరేక పవనాలలో పరాజయం పాలయ్యారు. ఓటమి తరువాత కన్నబాబురాజు రాజకీయంగా పెద్ద యాక్టివ్ గా లేరు. అయితే గత రెండు నెలలుగా ఆయన మళ్లీ చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ దశలో ఆయన వచ్చే ఎన్నికలలో తన కుమారుడిని పోటీకి నిలబెట్టాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా ఉంటున్నారు. అయితే.. ఈ దశలో ఉన్నట్టుండి కరణం ధర్మశ్రీని ఎలమంచిలి సమన్వయకర్తగా పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ ప్రకటనకు కొన్ని రోజులు ముందు కన్నబాబు రాజును వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ సారి కన్నబాబు రాజుకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే మొదటి నుంచీ కూడా కన్నబాబురాజు ప్రత్యక్ష ఎన్నికలో తన కుమారుడిని గెలిపించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుకు కావలసిన పట్టు కన్నబాబురాజుకు యలమంచలి నియోజకవర్గంలో ఉంది కూడా. అందుకే జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ కు కన్నబాబురాజు అంగీకరించే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా తన పుట్టినరోజు రోజున పార్టీ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీని నియమిస్తూ ప్రకటన వెలువడటంపై కన్నబాబురాజు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా పార్టీలోని ఒక వర్గం తనకు వ్యతిరేకంగా పని చేస్తోందని కన్నబాబురాజు భావిస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనవసరంగా తన నియోజకవర్గ వ్యవహారాలలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా గుడివాడ అమర్నాథ్ బొడ్డేడి ప్రసాద్ ద్వారా తనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు కొనసాగించారని ఈ సందర్భంగాకన్నబాబురాజు గుర్తు చేస్తున్నారు. పార్టీ పరాజయం తరువాత గుడివాడ అమర్నాథ్ ను పార్టీ అధినేత జగన్ చోడవరం ఇన్చార్జిగా నియమించారు. దీంతో అప్పటి వరకూ అక్కడ ఇన్ చార్జ్ గా ఉన్న కరణం ధర్మశ్రీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఇక్కడే గుడివాడ చక్రం తిపపారని కన్నబాబురాజు వర్గం అనుమానిస్తోంది. తన వయస్సును కారణంగా చూపి పక్కన పెట్టే విధంగా గుడివాడ తనకు వ్యతిరేకంగా పావులు కదిపారనీ, ఆ కారణంగానే యలమంచలి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కరణం ధర్మశ్రీ నియామకం జరిగిందని కన్నబాబు రాజు వర్గం అంటున్నది. వాస్తవానికి కన్నబాబు రాజు తన స్థానంలో తన కుమారుడిని తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కన్నబాబురాజు కుమాడుడు సుకుమార్ వర్మ గత దశాబ్దంగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉంటున్నారు. ఇప్పుడు ఉరుములేని పిడుగులా నియోజవర్గ సమన్వయకర్తగా జగన్ కరణం ధర్మశ్రీని నియమించడం వెనుక గుడివాడ అమర్నాథ్ ఉణ్నారని కన్నబాబు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కరణం ధర్మశ్రీ నియామకంతో ఉత్తరాంధ్ర వైసీపీలో సామాజిక సమతుల్యం కూడా దెబ్బతిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక పోతే యలమంచలిలో కరణం ధర్మశ్రీకి సహకారం అందే పరిస్థితి ఇసుమంతైనా లేదని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో నియోజవకర్గంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు.
http://www.teluguone.com/news/content/gudivada-amarnath-dispute-in-yalamanchili-25-201818.html





