గవర్నర్ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయి ఉండాలా?
Publish Date:Jun 21, 2014
Advertisement
యూపీఏ హయంలో రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేప్పట్టిన నరసింహన్ సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాలు రెండు చూసినవారే. ఆయనే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలకు గవర్నర్ గ కొనసాగుతుండటంతో ఏ రోటి కాడ ఆ పాట పాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణా శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గొప్పదనం గురించి దాని లక్ష్యాల గురించి తన ప్రసంగంలో వివరించారు. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర ప్రజల మనసులు గాయపడ్డాయని అందుకే కాంగ్రెస్ ను గద్దె దించి చంద్రబాబు ప్రభుత్వానికి పట్టం కట్టారని వివరించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరుగా సాగుతున్నపుడు కూడా ఆయనే రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. అయితే ప్రజల మనసులు గాయపడ్డాయని ఆనాడు ఆయన దైర్యంగా యూపీఏ ప్రభుత్వంతో గట్టిగా చెప్పారో లేదో తెలియదు కానీ ప్రజలు ఏమనుకొన్నా ఖాతరు చేయకుండా యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసి అందుకు తగిన శాస్తి అనుభవించింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రజల హృదయాలు గాయపడ్డాయని ఇప్పుడు సభాముఖంగా చెపుతున్న గవర్నర్ ఆనాడు కేవలం ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించారు? అనేదే ప్రశ్న. రాష్ట్రానికి ప్రధమ పౌరుడుగా గౌరవం పొందుతున్న ఆయన సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాల సమయంలో ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను, వారి ఆవేదనను కళ్ళార చూసి కూడా స్పందించకపోవడం, ఇప్పుడు ఆయనే మళ్ళీ ఆ విషయాన్ని స్వయంగా తన ప్రసంగంలో పేర్కొనడం రెండూ ఆశ్చర్యకరమయిన విషయాలే. ఈ విషయంలో ఆయన కేవలం తాను నిమిత్తమాత్రుడనన్నట్లు వ్యవహరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఇదివరకు యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా, ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రాకు, తెలంగాణాలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడవలసి రావడం ఆయన నిర్వహిస్తున్న పదవి రీత్యా సహజమే అనిపించినా, రాష్ట్రానికి ప్రధమ పౌరుడిగా ఆయన రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు, ఆవేదనకు ప్రతిస్పందించి ఉంటే హుందాగా ఉండేది. అందువలన రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన, ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఒకదానితో మరొకటి కలహించుకొంటున్నపుడు ప్రేక్షకపాత్ర వహించి మళ్ళీ రేపు ఎప్పుడో ఇదేవిధంగా సుద్దులు చెప్పినట్లయితే హాస్యాస్పదంగా ఉంటుంది.
http://www.teluguone.com/news/content/governor-45-35086.html





