గోదావరి వరద ఉధృతి: భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం.!
Publish Date:Sep 27, 2026
Advertisement
గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదవరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలు నది పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇక కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 14.8 మీటర్లు, పోలవరం వద్ద 9.98 మీటర్లు నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఇది మరింత పెరిగి 8 నుంచి 9 లక్షల క్యూసెక్కుల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక మరియు రక్షణ చర్యల నిమిత్తం ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించేలా ఈ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. నది నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నందున.. గోదావరి వరద మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరద ఉద్ధృతి కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కల్వర్టులు, కాజ్వేల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ మార్గాలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. [Godavari River Flood, Bhadrachalam Water Level, Dhavaleswaram Barrage, AP Disaster Management, NDRF SDRF Teams]
http://www.teluguone.com/news/content/godavari-river-flood-36-232656.html




