కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు?
Publish Date:Jan 10, 2025
Advertisement
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావులో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. గురువారం (జనవరి 9) దాదాపు ఏడుగంటల పాటు ఏసీబీ విచారణను ఎదుర్కొన్న కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తుంటే.. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయన పూర్తిగా ఇరుక్కున్నారని అర్ధమౌతోందని అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు గురువారం (జనవరి 9) సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణ ముగిసి ఆయన బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ అధికారులు తనను 85 ప్రశ్నలు అడిగారనీ చెబుతూ, అవన్నీ రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలే అంటూ చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ కార్ కేసు ఓ లొట్టపీసు కేసనీ, రేవంత్ రెడ్డి ఓ లొట్టపీసు సీఎం అంటూ వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేటీఆర్ కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. అయినా ఇప్పుడు విపక్షంలో ఉండి ఆయన కనీస సంయమనం లేకుండా మాట్లాడారు. నడి రోడ్డుపై మీడియాతో మాట్లాడారు. అందుకు అభ్యంతరం చెప్పిన పోలీసులపై విరుచుకుప్పడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రోడ్డుపై ప్రెస్ మీట్లకే కాదు.. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో కూడా సభలూ, సమావేశాలకు అనుమతి లేదన్న సంగతి ఆయన ఇప్పుడు కన్వీనియెంట్ గా మర్చిపోయారు. నడిరోడ్డుపై సమావేశాలు జనాలకు ఇబ్బంది అన్న కనీస స్ఫృహ కూడా లేకుండా ఆయన వ్యవహరించారని అంటున్నారు. ఈ ఫార్ములా కార్ కేసులో కేసులో నిధుల బదలాయింపు జరిగిందనీ, అందుకు తానే ఆదేశాలిచ్చాననీ చెబుతూ కూడా తప్పు జరగలేదని దబాయించడానికే ప్రయత్నించారు. నిబంధనలను తుంగలో తొక్కి ఆదేశాలిచ్చి.. వాటిని అమలు చేసిన అధికారులదే తప్పు అంటూ తప్పించుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన మీడియా సమావేశం తరువాత పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏసీబీ అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరై ఆ ఉక్రోషాన్ని పోలీసులపై ప్రదర్శించినట్లు కనిపిస్తోందంటున్నారు. విచారణలో ఏసీబీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేయటంతో ఆ కోపాన్ని మీడియా సమావేశంలో కేటీఆర్ బయటున్న పోలీసులపైన చూపారని అర్ధమవుతోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ కేసులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని అంగీకరించలేక, జరగలేదని గట్టిగా చెప్పలేక కేటీఆర్ ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు విదేశీకంపెనీకి నిధులు ఎలా బదిలీచేస్తారన్న ప్రశ్నకు కేటీఆర్ ఆ విషయం అధికారులకు సంబంధించిందని తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అలాగే ఒప్పందం నుండి తప్పుకున్న కంపెనీపై లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకూ ఆయన నేరుగా బదులివ్వలేదని తెలుస్తోంది. ఎంత సేపూ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు తాను ప్రయత్నించానని చెప్పుకున్నారని అంటున్నారు. నిధుల బదలాయింపునకు క్యాబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకూ ఆయన సరైన బదులు ఇవ్వలేదంటున్నారు. విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సరైన సమాధానాలు ఇవ్వలేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఆయన విచారణకు సహకరించలేదనీ, అందుకే మరోసారి విచారణకు పిలుస్తామని చెబుతున్నారు. ఇదే విషయాన్ని వారు కేటీఆర్ కు కూడా చెప్పినట్లు సమాచారం. సంక్రాంతి తరువాత ఏదో ఒక రోజు కేటీఆర్ ను ఏసీబీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/frustration-peaks-in-ktr-25-191122.html





