తెలుగుదేశం గూటికి నలుగురు వైసీపీ ఎంపీలు?
Publish Date:Jul 17, 2024
Advertisement
వైసీపీ రాజ్యసభలో జీరో కాబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నా, రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు అంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్ కు ఆ ధీమా మిగిలే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆ పార్టీ సభ్యులు గంపగుత్తగా కాషాయ కండువా కప్పుకుంటారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఓ నలుగురు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదెలాగంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 16) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ గంటకు పైగా సాగింది. సరిగ్గా కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రోజుల ముందు జరిగిన ఈ భేటీలో విభజన హామీలు, ఐదేళ్ల వైకాపా పాలనలో అస్తవ్యస్థమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, కేంద్రం సహకారం వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయని అందరూ భావించారు. అయితే వీటితో పాటు ఆశ్చర్యకరంగా రాజ్యసభలో ఎన్డీయే బలం పెంచుకోవడం ఎలా? అన్న దానిపై కూడా అమిత్ షా, చంద్రబాబుల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. కేంద్రం ప్రవేశ పెట్టే బిల్లులు రాజ్యసభ ఆమోదం ముద్ర పడేందుకు అవసరమైన బలం ఎన్డీయేకు లేదు. బిల్లుల ఆమోదానికి అడ్డంకులు లేకుండా ఉండాలంటే ఎన్డీయే కూటమికి మరో 12 మంది సభ్యులు అవసరం ఉంది. దీంతో ఈ విషయంపై చంద్రబాబు, అమిత్ షాలు చర్చించారని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి బీజేపీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి ఎన్నికలలో పరా జయాన్ని మూటగట్టుకున్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఒక వేళ అందుకు బీజేపీ అంగీకరించకుంటే వైసీపీ, బీఆర్బఎస్ పార్టీలకు రాజీనామా చేసి కాషాయి కండువా కప్పుకోవడానికి ఆ రెండు పార్టీల ఎంపీలూ సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి బయట నుంచి మద్దతు పొందడం కంటే వారిని చేర్చుకుని సొంతంగా బలం పెంచుకోవడమే మంచిదన్న అభిప్రాయంతో అమిత్ షా ఉన్నారు. అంటే బయట నుంచి మద్దతు పొందడం కంటే ఆ సభ్యులను బీజేపీలో లేదా తెలుగుదేశంలో చేర్చుకుని సొంతంగా బలం పెంచుకోవడం మేలని అమిత్ షా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా కాషాయ కండువా కప్పే విషయంపైనే చంద్రబాబు, అమిత్ షాల మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారంతా కూడా కమలం గూటికి చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నది వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది.
రాజ్యసభలో మనకు బలం ఉంది. బీజేపీకి మన అవసరం ఉంది కనుక గట్టిగా నిలబడండి అని వైసీపీ అధినేత జగన్ తన పార్టీ రాజ్యసభ సభ్యులకు నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. దాంతో ఏం చేయాలో తోచని నిస్సహాయతలో పడిన జగన్ ప్రజాదర్బార్ ను కూడా రద్దు చేసుకుని బెంగళూరు వెళ్లిపోయారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయన అక్కడ నుంచి ఎప్పుడు తాడేపల్లి తిరిగి వస్తారు. పార్టీపై ఎప్పుడు దృష్టి పెడతారు అన్న విషయంలో క్లారిటీ లేక వైసీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. వైసీపీ సభ్యులను గంపగుత్తగా బీజేపీలో చేర్చుకునే విషయంపై చంద్రబాబు, అమిత్ షాల చర్చల్లో భాగంగా ఓ నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో కాకుండా తెలుగుదేశం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి బయటపడింది. అలా తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురే కాకుండా మరో సభ్యుడు కూడా తెలుగుదేశం గూటికి చేరాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు 2019లో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. మొత్తం మీద మీద రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/four-ycp-mps-join-tdp-25-180915.html





