మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో పాటూ కుమారుడు అరెస్ట్
Publish Date:Nov 2, 2022
Advertisement
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు గురువారం (నవంబర్3) తెల్లవారుజామున అరెస్టు చేశారు. నర్సీపట్నంలో అయ్యన్నతో పాటూ కుమారుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు సెక్షన్ సీఆర్పీసీ 50ఎ కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు గా పేర్కొంటూ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇరువురినీ గురువారం (నవంబర్ 3)ఏలూరు కోర్టులో హాజరుపరుస్తారు. వీరిరువురిపైనా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు దొంగల్లా గోడ దూకి దొంగల్లా ఇంట్లోకి ప్రవేశించారనీ, తలుపులు పగులగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నించారనీ అయ్యన్న పాత్రుడి కోడలు, రాజేష్ భార్య పద్మావతి ఆరోపించారు. తన భర్త రాజేష్ తలుపులు తీసి ఎందుకు వచ్చారని ప్రశ్నిచారనీ, అయితే అందుకు సమాధానం చెప్పకుండా ఈడ్చుకుపోయారనీ ఆమె ఆరోపించారు. తెల్లవార జామున తమ నివాసంపై దాడి చేసిన పోలీసులు తాగి ఉన్నారనీ, దుర్భాషలాడారని ఆమె పేర్కొన్నారు. తన భర్త రాజేష్, మామ అయ్యన్న పాత్రుడులను ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్టు చేశారని ఆమె పేర్కొన్నారు. గతంలో అయ్యన్నపాత్రుడి నివాసం దగ్గర ప్రహరీ గోడ విషయంలో వివాదం రేగిన సంగతి విదితమే. అయ్యన్న పంట కాలువ స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టారని కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. అనంతరం హైకోర్టులో పిటిషన్ వేయగా అయ్యన్న కుటుంబానికి ఊరట దొరికింది. మళ్లీ అదే కేసులో ఫోర్జరీ డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారనే అభియోగాలపై ఇప్పుడు అయ్యన్నపాత్రుడితో పాటూ ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
http://www.teluguone.com/news/content/former-minister-ayyannapatrudu-and-his-son-arrested-by-cid-police-25-146473.html





