వినాయక పూజ చేసి ప్రసాదం స్వీకరించిన జగన్.. ఈ మార్పు వెనుక మర్మమేంటో?
Publish Date:Aug 28, 2025
Advertisement
జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది. జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం, కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులకు ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత జగన్ అధికారం కోల్పోయిన తరువాత.. ఆయన హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయట పడింది. అంతే కాదు.. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు కొలువులు, తిరుమలలో అన్యమత ప్రచారం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. అదే విధంగా దేవుడి ప్రసాదం తినడానికి కూడా జగన్ ఇష్టపడరన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం నివాసంలో ప్రత్యేక పూజలు జరిగిన ప్రతి సందర్భంలోనూ జగన్ కానీ, ఆయన సతీమణి భారతి కానీ ప్రసాదం ముట్టలేదని అంటారు. ఆయన మత విశ్వాసం మారిందో, లేక మారినట్లు కనిపిస్తే తప్ప జనం మద్దతు పొందలేమనుకున్నారో కానీ వినాయకచవిత సందర్భంగా బుధవారం (ఆగస్టు 27)న ఆయన గణపతి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. వినాయకచవితి సందర్భంగా జగన్ తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో గణపతి పూజ చేశారు. ఆయన నేరుగా పూజలో పాల్గొనడం, పూజ చేయడం ఇదే తొలిసారి. పూజ అనంతరం పూజారులు ఆయనకు ప్రసాదం అందించారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. దీనిపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ ప్రసాదం స్వీకరించడం ద్వారా జగన్ ఇంత కాలం తన తీరుకు భిన్నంగా వ్యవహరించడం ఆసక్తి కలిగిస్తోంది. ఏది ఏమైనా వినాయక చవితి సందర్భంగా జగన్ ప్రసాదం స్వీకరించడం మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది.
http://www.teluguone.com/news/content/former-cm-kagan-take-prasadam-after-performing-vinayakapuja-25-205135.html





