టీటీడీకి విరాళాల వెల్లువ..ఒక్కరోజే రూ.97 కోట్లు.!
Publish Date:Jul 15, 2026
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక్క రోజులో ఊహించని స్థాయిలో 97 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఒక్క రోజులో దాతలు శ్రీవారికి ఇచ్చిన విరాళాలు టీటీడీలో కొత్త రికార్డును సృష్టించాయి. కేవలం ఒకే ఒక్క రోజులో దాతల నుంచి టీటీడీకి రూ.96.98 కోట్ల విరాళాలు లభించాయి.అయితే ఒక్క రోజులోనే ఇంత భారీగా శ్రీవారికి విరాళాలు రావడానికి టీటీడీ బోర్డు తీసుకున్న త కీలకమైన నిర్ణయమే కారణం. టీటీడీ ధర్మకర్తల మండలి దాతలకు కల్పించే దర్శన సౌకర్యాలు, నిబంధనలను హేతుబద్ధీకరిస్తూ కీలక ప్రకటన చేసింది. రూ.1 లక్ష నుండి రూ.1.5 కోట్ల వరకు విరాళాలు అందించే దాతలకు సంబంధించిన కొత్త నిబంధనలు అదే రోజు అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తాయని బోర్డు స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుండి దేశ, విదేశాల్లోని శ్రీవారి భక్తులలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. పాత నిబంధనల ప్రకారం లభించే లబ్ధిని, శాశ్వత దర్శన ప్రయోజనాలను ఎలాగైనా దక్కించుకోవాలనే తాపత్రయంతో భక్తులు శ్రీవారికి విరాళాల వెల్లువ కురిపించారు. కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి మిగిలి ఉన్న ఆ కొద్ది గంటల సమయాన్ని దాతలు యుద్ధప్రాతిపదికన ఉపయోగించుకున్నారు. దీంతో ఆన్‌లైన్ పోర్టల్స్, డిజిటల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా విరాళాలు సమర్పించేందుకు భక్తులు తీవ్రంగా పోటీ పడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మొత్తం 2 వేల 460 మంది దాతలు శ్రీవారికి మంగళవారం (జులై 14)న విరాళాలు సమర్పించారు. అలా విరాళాలు ఇచ్చిన వారిలో 1,212 మంది రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల మధ్య విరాళాలు ప్రకటించగా, మరో 1,246 మంది భక్తులు రూ.10 లక్షల నుండి రూ.25 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. ఇక ఇద్దరు భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తలో కోటి రూపాయల చొప్పున విరాళాలను అందించారు. మొత్తం విరాళాలలో 2,354 విరాళాలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ రూపంలో రాగా, కేవలం 106 విరాళాలు మాత్రమే తిరుమలలోని ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా నేరుగా వచ్చాయి. సాధారణంగా ఏడాది పొడవునా వచ్చే విరాళాల సరళిని పరిశీలిస్తే, నవంబర్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో టీటీడీకి మొత్తం రూ.918.6 కోట్ల విరాళాలు వచ్చాయి. కానీ, దానికి భిన్నంగా ఒకే ఒక్క రోజులో దాదాపు రూ.97 కోట్లు రావడం విశేషం. ఇంత తక్కువ సమయంలో, ఇంత భారీ సంఖ్యలో దాతలు తరలిరావడం చరిత్రలో ఇదే మొదటిసారని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి ధృవీకరించారు. TTD donations record, Tirumala temple news, TTD new darshan rules, Tirupati donor
http://www.teluguone.com/news/content/flood-of-donations-to-ttd-36-226116.html





