జగన్ టూర్ బహిష్కరణ.. మత్స్యకారుల సంచలన నిర్ణయం!
Publish Date:Apr 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను బహిష్కరించాలని మత్స్యకారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుండి ఇటీవల నాలుగు బోట్లు మాయం అయ్యాయి. గతంలో తమిళనాడుకు చెందిన కొన్ని బోట్లు అక్రమంగా చేపల వేట సాగిస్తుండగా, స్థానిక మత్స్యకారులు వాటిని పట్టుకుని హార్బర్‌లో ఉంచారు. అయితే, ఆ బోట్లు అనుమానాస్పద స్థితిలో మాయం కావడంతో మత్స్యకారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ బోట్ల అదృశ్యం వెనుక రాజకీయనేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మత్స్యకారులు పొలిటికల్ లీడర్ల పర్యటనలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారుల ప్రధాన డిమాండ్ ఏమిటంటే, మాయమైన బోట్ల వ్యవహారం పూర్తిగా తేలే వరకు రాజకీయ పార్టీలకు, వాటి కార్యక్రమాలకు, అలాగే రాజకీయ నేతలకు తాము దూరంగా ఉంటామని కుండబద్దలు కొడుతున్నారు. తమ సమస్య పరిష్కారం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు రావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇటు అధికార కూటమి నాయకులకు, అటు ప్రతిపక్ష వైకాపా నేతలకు కూడా సహకరించకూడదని ఇసకపల్లి, పట్టపుపాలెం గ్రామాల మత్స్యకారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు జగన్ జువ్వలదిన్నె పర్యటన ఉంటుందా? రద్దౌతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా మత్స్యకార గ్రామాల్లో సామాజిక కట్టుబాట్లు చాలా బలంగా ఉంటాయి. రానున్న రోజుల్లో ఈ బోట్ల వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/fisherman-decide-to-boycott-jagan-39-217375.html





