మట్టి మనుషుల అరణ్యరోదన!
Publish Date:Aug 10, 2025
Advertisement
జై జవాన్.. జై కిసాన్.. జైహింద్.. నినాదాలకే పరిమితమా? కర్షకులకు, శ్రామికులకు సరైన ఆదాయం లేక విలవలలాడుతున్న జన భారతం. వివరాల్లోకి వెడితే.. ఆరు దశాబ్దాల కిందట భారతావని వరుస కరువు కాటకాలతో ఆకలి కేకలతో అల్లాడి, తల్లడిల్లిపోయింది. విదేశాల నుంచి ధాన్యం వస్తే తప్ప మన పొయ్యిలోని పిల్లి లేవని దుస్థితి. నాడు ఓడ వస్తేనే నోట్లోకి ముద్ద వెళ్లేది అనే నానుడి దేశ ప్రతిష్ఠకు మచ్చలా మారింది. అన్నదాతలు, మట్టిమనుషులకి వ్యవసాయం అంటేనే వ్యయం చేయడం, సాయం అడగడం పరిపాటి అయిపోయింది. నేటి రైతు దుస్థితికి ప్రభుత్వ విధానాలు కారణమైతే.. ప్రకృతి వికృతి రూపం కారణం. రైతే దేశానికి వెన్నెముక అంటారు. సకలచరాచర జీవకోటికి అన్నంపెట్టే అన్నదాత.. ఆర్తనాదాలు లేని గ్రామాలే లేవంటే అతిశయోక్తి కాదు. కారణాలు అనేకం. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. పండించిన పంటలను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగులు లేవు. రైతులకు సకాలంలో ఎరువులు, క్రిమి సంహారక మందులపై సబ్సిడీ అందుబాటులో ఉండటం లేదు. క్రిమి సంహారక మందుల ధరలు ఏటాటా అడ్డూ అదుపూ లేకుండా పెస్టిసైడ్స్ కంపెనీలు పెంచుకుంటూ పోతుంటే..కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రులు లంచాలవతారులై రైతు వెన్ను విరుస్తున్నారు. నకిలీ పెస్టిసైడ్స్, విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అమ్మేవారిపైన కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం ఫలసాయం అవుతుంది.. వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు సృష్టించడంలో మన శాస్త్రవేత్తలు వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా ప్రభుత్వమే సేకరించి రైతులకు తక్షణమే ప్రభుత్వ మద్దతు ధరతో చెల్లించే ప్రక్రియ లేనే లేదు. మధ్య దళారీ వ్యవస్థ వల్ల అటు రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో రాయలసీమలో తోతాపురి మామిడి రైతుల దుస్థితి చూశాము. అదే విధంగా పక్కనే ఉన్న మెట్రోపాలిటిన్ నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన నగరాలలో తోతాపురి మామిడి కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకూ అమ్మడం జరిగింది. కనీసం రైతులకు కేజీకి ఎనిమిది రూపాయలు కూడా గిట్టుబాటు కాలేదు. దీనికి కారణం ఎవరు? మన పాలకుల విధి విధానాలే. ఇలాగా అన్ని పంటల దుస్థితి ఇలాగే దాపురించింది. ప్రభుత్వాలు మేలుకోకపోతే దేశంలో భవిష్యత్ లో వ్యవసాయం చేసే వారే కరువౌతారు. తస్మాత్ జాగ్రత్త.!
అలాంటి దుర్భర, దీనావస్థ నుంచి అనతి కాలంలోనే ఆహార ధాన్యాల దిగుబడిలో స్వావలంబన సాధించగలిగే స్థాయికి భారత దేశం చేరుకోగలిగింది. హరిత విప్లవం పితామహుడు, ఎంఎస్ స్వామినాథ్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త నార్మన్ బోర్లాంగ్ సహకారంతో 1960లో మొదలైన హరిత విప్లవం భారత జాతి తలరాతను మార్చివేసింది. ఆధునిక దిగుబడి ఇచ్చే వంగడాల వినియోగం, నీటి వనరుల సమర్థ వాడకం, చీడపీడ నివారణల పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో హరిత విప్లవం ప్రారంభమైన ఐదేళ్లలోనే దేశీయంగా గోధుమ ఉత్పత్తి దాదాపు రెట్టింపైంది. రెండున్నర దశాబ్దాలలో వరి ఉత్పాదకతలో మూడు రెట్లు వృద్ధి నమోదైంది. హరిత విప్లవం దరిమలా జన భారతానికి ఆహారభద్రత లభించినప్పటికీ.. సాగుదారుల ఆదాయాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. రైతు సంక్షేమానికి ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు బుట్లదాఖలయ్యాయి. సిఫారసులు ఆచరణలోకి తీసుకురావడంపై ప్రభుత్వాలు దృష్టి సారించినప్పుడే సాగురంగ రుషి అయిన ఎంఎస్ స్వామినాథన్ కు ఘనమైన నివాళి.
http://www.teluguone.com/news/content/farmers-distruss-with-governmen-policies-39-203932.html





